
పెరుగుతున్న నిషిద్ధ పొగాకు ఉత్పత్తుల వాడకం
సిగరెట్ల మీద పన్నులపై ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్
న్యూఢిల్లీ: సిగరెట్లపై ఎంత ఎక్కువగా పన్నులు విధిస్తే.. నిషిద్ధ పొగాకు ఉత్పత్తుల వాడకం అంత ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉందని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ హెచ్చరించారు. దీనివల్ల ఆదాయం తగ్గిపోవడంతో పాటు భారతీయ బ్రాండ్‌కి అపార నష్టం కూడా వాటిల్లుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
రాబోయే బడ్జెట్‌లో సిగరెట్లపై పన్నులు ఒక మోస్తరు స్థాయిలోనే ఉంచగలరని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మకాలు ఒక మోస్తరుగా మాత్రమే పెరగడానికి.. ఇటు ఎక్సైజ్ సుంకాలు, అటు విలువ ఆధారిత పన్నులు పెరగడం కారణం అవుతున్నాయని దేవేశ్వర్ పేర్కొన్నారు. ఈ చర్య.. చట్టబద్ధమైన సిగరెట్ల వ్యాపార పరిశ్రమ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా మొత్తం పొగాకు పరిశ్రమ ఆదాయ అవకాశాలను కూడా దెబ్బతీస్తోందని ఆయన వివరించారు.