చెల్లని నోట్ల మార్పిడికి చివరి చాన్స్‌ | After NDTV Report, Cooperative Banks, Post Offices Can Deposit | Sakshi
Sakshi News home page

చెల్లని నోట్ల మార్పిడికి చివరి చాన్స్‌

Published Thu, Jun 22 2017 1:25 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

చెల్లని నోట్ల మార్పిడికి చివరి చాన్స్‌

చెల్లని నోట్ల మార్పిడికి చివరి చాన్స్‌

గడువు జూలై 20; సహకార బ్యాంకులకూ వెసులుబాటు  
న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను ఆర్‌బీఐ వద్ద జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లా సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఇందుకు జూలై 20వ తేదీని గడువుగా పేర్కొంది. డీమోనిటైజేషన్‌లో భాగంగా ప్రజల నుంచి సమీకరించిన రద్దయిన నోట్లు ఏవైనా మిగిలి ఉంటే వచ్చే నెల 20లోపు ఆర్‌బీఐ వద్ద మార్చుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఇన్నాళ్లూ ఎందుకు డిపాజిట్‌ చేయలేదన్న కారణాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుందని షరతు విధించింది.

గతేడాది నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆ నోట్లను ప్రజల నుంచి స్వీకరించేందుకు వాణిజ్య బ్యాంకులకు డిసెంబర్‌ 30 వరకు అనుమతించగా, జిల్లా కోపరేటివ్‌ బ్యాంకులకు మాత్రం కేవలం నాలుగు రోజులే నవంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చారు. దీనిపై కోపరేటివ్‌ బ్యాంకులు అప్పుడే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రద్దయిన నోట్లను స్వీకరించేందుకు ఉద్దేశించిన అధికారిక నోటిఫికేషన్‌ నవంబర్‌ 14 చివరి రోజే వచ్చిందని కోర్టుకు వివరించాయి. దీంతో రద్దయిన నోట్లను డిపాజిట్‌ చేసేందుకు జిల్లా కోపరేటివ్‌ బ్యాంకులకు మరో అవకాశమిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజా నోటిఫికేషన్‌ విడుదలైనట్టు ఓ అధికారి వెల్లడించారు.

మారుమూల ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు, పోస్టాఫీసుల్లోనూ కోట్లాది రూపాయల విలువైన రద్దయిన నోట్లు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్రలోని కొన్ని సహకార బ్యాంకుల వద్ద రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.2,770 కోట్ల మేర ఉన్నట్టు సమాచారం. పరోక్షంగా దీని ప్రభావం నష్టాల్లో ఉన్న ఒక్కో రైతుకు రూ.10,000 అందించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ పథకంపై పడింది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటి నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రం చివరి అవకాశం ఇచ్చినట్టయింది. మరోవైపు రద్దయిన నోట్లను మార్చుకునేందుకు ఎన్‌ఆర్‌ఐలకు ఇచ్చిన అవకాశం కూడా ఈ నెల 30తో ముగిసిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement