
ఎయిర్‌కోస్టా సేవలను విస్తరిస్తాం
సంస్థ చైర్మన్ లింగమనేని రమేష్
విజయవాడ: దక్షిణ భారతదేశంలో విజయవాడ కేంద్రంగా నడుపుతున్న ఎయిర్‌కోస్టా సేవలను మరింత విస్తరించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ లింగమనేని రమేష్ చెప్పారు. నగరంలో బుధవారం ఎయిర్‌కోస్టా తొలి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఏటా తమ సంస్థ నాలుగు కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తుందన్నారు. వ చ్చే మార్చి నాటికి మరో 4 విమానాలను అందుబాటులో ఉంచుతామన్నారు.
విజయవాడ నుంచి ముంబై, బెంగళూరు, వైజాగ్ తదితర ముఖ్య నగరాలకు సర్వీసులు నడుపుతామని ప్రకటించారు. ఏడాది కాలంగా ఎయిర్‌కోస్టా 9 నగరాలకు 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 38 విమానాలను(సర్వీసులు) నడుపుతున్నట్లు చెప్పారు. నిత్యం 3 వేల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నామని వివరించారు. ఏడాదిలో తమ సంస్థ 71% ఆక్యుపెన్సీ సాధించినట్లు చెప్పారు.
తుపాను బాధితులకు రూ. 25 లక్షల విరాళం
‘హుదూద్’ బాధితులకు ఎయిర్‌కోస్టా రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్లు చైర్మన్ ఎల్.రమేష్ ప్రకటించారు. ఆ నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతామన్నారు. దీంతో పాటు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కూడా ఒక రోజు వేతనాన్ని విరాళంగా పంపుతారని వివరించారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డెరైక్టర్ చౌదరి, సీఈవో కె.ఎన్.బాబు, సంస్థ ప్రతినిధులు వివేక్ చౌదరి, గేరజ్‌కుమార్ సింహా మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ ఎం.సి.దాస్ తదితరులు పాల్గొన్నారు.