హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ!. | Air India privatisation not now, says Civil Aviation Minister Ashok Gajapathi Raju | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ!.

Published Tue, Nov 11 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ!.

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ!.

నూతన పౌరవిమానయాన పాలసీ ముసాయిదాను రూపొందించినట్టు పూసపాటిఅశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.

 సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందడుగుగా నూతన పౌర విమానయాన పాలసీ ముసాయిదాను రూపొందించినట్టు  పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి రాజీవ్ భవన్‌లో ఆయన ముసాయిదా పత్రాన్ని విడుదల చేశారు. ‘కొత్త పౌర విమానయాన పాలసీ వచ్చే జనవరి నుంచి అమలు కాబోతోంది’ అని ప్రకటించారు.

ప్రజలు, విమానయాన రంగంతో సంబంధం ఉన్న వారు 3 వారాల్లో తమ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. తర్వాత 6 వారాల్లో విమానయాన రంగ నిపుణుల బృందాలు ఈ రంగంతో ముడిపడి ఉన్నవారితో సంప్రదింపులు జరిపి తుది పాలసీని రూపొందిస్తాయని తెలిపారు.  ఈ పత్రా న్ని విమానయాన శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు వివరించారు. ముసాయిదా పత్రంలోని ముఖ్యాంశాలను ఆ శాఖ కార్యదర్శి సోమసుందరన్‌తో కలిసి మీడియాకు వివరించారు.
 ‘విమానాశ్రయాలను మల్టీ మోడల్ హబ్స్‌గా అభివృద్ధి చేయాల్సి ఉంది.

  రైలు, మెట్రో, బస్సు, ట్రక్ రవాణా వసతులను విమానాశ్రయాలకు అనుసంధానించడం, వసతి సౌకర్యం ఏర్పాటుచేయడం ద్వారా ఈ మల్టీమోడల్ హబ్‌లను ఏర్పాటుచేయవచ్చు..’ అని పూసపాటి వివరించారు. విమానాశ్రయాలను అభివృద్ధి చేసే క్రమంలోనే వీటితో ముడివడి ఉన్న ఉత్పత్తి రంగం, వాణిజ్య రంగం, పర్యాటకం, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వీటిని చేపట్టాల్సి ఉందన్నారు.

ఆరు మెట్రో నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లోని విమానాశ్రయాలను భారీ అంతర్జాతీయ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రయాణాలకు ఇవి ప్రధాన విమానాశ్రయాలుగా మారుతాయన్నారు. అలాగే ప్రాంతీయ నెట్‌వర్క్‌లను అనుసంధానం చేస్తూ పౌర విమాన యాన సేవలు పెంపొందిస్తామని వివరించారు. విమాన టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరను హేతుబద్ధీకరించేందుకు వీలుగా ఈ ముసాయిదా పత్రం దోహదపడుతుందన్నారు.

అత్యధికంగా విధిస్తున్న పన్నుల కారణంగా ఏటీఎఫ్ ధర ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 40 నుంచి 45 శాతం అధికంగా ఉందన్నారు. అందువల్ల ఆర్థిక శాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి దీనిని తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు.

 విజయవాడలో భూసేకరణ జరిగితే..: విజయవాడ ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ జరగాల్సి ఉందని తెలుగు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘సేకరణ అయిన తరువాత పనులు ప్రారంభమవుతాయి. టర్మినల్ చిన్నదిగా ఉంది. పార్కింగ్ ప్లేస్ చిన్నది. భోపాల్ దగ్గర 13 విమానాలు నిలిపేంత స్థలం ఉంది. అలా అయినా ఉండాలి. విజయవాడలో మూడే నిలుపుకోవచ్చు’ అని చెప్పారు.  విశాఖ, తిరుపతిలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

 తెలంగాణ విషయంలో...
 పీపీపీ విధానంలో తెలంగాణ రాష్ట్రంలో ఏవైనా విమానాశ్రయాలు వస్తాయా? అని ప్రశ్నించగా ‘రావొచ్చు.. ఏదైనా అడగాలి కదా.. రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు చేయడానికేముంది?..’ అంటూ ప్రశ్నించారు. నిజామాబాద్, వరంగల్ల్‌లో ఎయిర్‌పోర్టులు, బేగంపేటలో అకాడమీ అడిగారు కదా అని ప్రశ్నించగా ‘బేగంపేటలో అకాడమీ ఉంది.

దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతోంది. విస్తరణ చేసుకోవాలనుకుంటే ఆ రాష్ట్రం చేతుల్లోనే ఉంది..’ అని పేర్కొన్నారు. హజ్ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటు రంగం చేతుల్లో పెట్టేస్తున్నారన్న ప్రశ్నకు.. మెరుగైన పనితీరు లేకుండానే మోయడం మంచిది కాదు కదా అని ప్రశ్నించారు.

 ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, పవన్  హన్స్‌ల  లిస్టింగ్
 సంస్థాగత సంస్కరణల్లో భాగంగా ఎయిర్ ఇండియా భవిష్యత్తుపై రోడ్ మ్యాప్ రూపొందించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుచేయనున్నట్టు అశోక్ గజపతి వివరించారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కార్పొరేటీకరిస్తామని, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయిస్తామని.. ఇది మెరుగైన పనితీరుకు, పారదర్శకతకు దోహదం చేస్తుందని వివరించారు. అలాగే పవన్ హన్స్‌ను కూడా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయిస్తామని తెలిపారు.

పనితీరులో సమర్థత, పారదర్శకత పెంచేందుకే మినీ రత్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), పవన్ హన్స్ హెలికాప్టర్స్ (పీహెచ్‌హెచ్‌ఎల్) సంస్థలను లిస్టింగ్ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు మంత్రి వివరించారు. అయితే, లిస్టింగ్ ఎప్పుడు చేసేదీ, ఎంత శాతం వాటాలు విక్రయించేదీ వంటి విషయాలపై నిర్దిష్టంగా నిర్ణయం ఏమీ తీసుకోలేదని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

 ఎయిరిండియా కూడా లిస్టయితే సంతోషమే..
 ఏఏఐ, పీహెచ్‌హెచ్‌ఎల్ తరహాలోనే ఎయిరిండియాను కూడా స్టాక్‌మార్కెట్లలో లిస్టింగ్ చేస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అలా చేయగలిగితే అందరికన్నా ఎక్కువగా సంతోషించేది తానేనని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. సంస్థ భవిష్యత్ ప్రణాళికను రూపొందించేందుకు అంతర్గతంగా నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎయిరిండియాను గట్టెక్కించడం అవసరమన్నారు.

కంపెనీని ప్రైవేటీకరించాలని కొన్ని వర్గాలు, కూడదంటూ మరికొన్ని వర్గాలు, ప్రొఫెషనల్స్ చేతిలో పెట్టాలని ఇంకొన్ని వర్గాలు అంటున్నాయని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వం సమస్యల తుట్టెను కదపకూడదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భంలో అన్ని అవకాశాలను పరిశీలించి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఏది ఏమైనప్పటికీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే వాటాల విక్రయమా లేక ప్రొఫెషనల్స్ చేతికి అప్పగించడమా అన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు చెప్పారు. పీహెచ్‌హెచ్‌ఎల్ ఇప్పటికే రిజిస్టర్డ్ కంపెనీ అయినందున లిస్టింగ్ ప్రక్రియకు ఆరు నెలల కాలం సరిపోగలదని ఆయన పేర్కొన్నారు. దీనిపై డిజిన్వెస్ట్‌మెంట్ విభాగంతో కలిసి పనిచేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement