ఎయిర్‌టెల్ ''బోనస్ 30జీబీ'' ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. తన కొత్త పోస్టుపెయిడ్ కస్టమర్లకు ''బోనస్ 30జీబీ'' ఆఫర్‌ను సోమవారం ప్రకటించింది. మూడు నెలల కాలాల పాటు నెలకు 10జీబీ ఉచిత డేటా చొప్పున 30జీబీ ఉచిత డేటాను పోస్టుపెయిడ్ యూజర్లకు అందించనున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ కొత్త ఆఫర్ కింద ఉచితంగా సిమ్‌ను కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నట్టు కూడా చెప్పింది. కంపెనీకి చెందిన అన్ని అపరిమిత సిరీస్ పోస్టు పెయిడ్ ప్లాన్లకు ఈ కొత్త ఎయిర్‌టెల్ 30జీబీ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తన వెబ్‌సైట్‌లో తెలిపింది. రూ.499, రూ.649, రూ.799, రూ.1,199 ప్లాన్ల అన్నింటికీ బోనస్ 30జీబీ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఈ నెలలో వాడుకోని డేటాను వచ్చే నెలకు బదిలీ చేసుకునే అవకాశం కూడా యూజర్లకు ఉంది.
ఈ నెల మొదట్లో కూడా ఎయిర్‌టెల్ తన పోస్టుపెయిడ్ కస్టమర్లకు 60జీబీ వరకు ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించనున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. కంపెనీకి చెందిన ఎయిర్‌టెల్ టీవీ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్న కస్టమర్లకు ఈ ఉచిత డేటా అందించనున్నట్టు చెప్పింది. అంటే నెలకు 10జీబీ చొప్పున ఆరు నెలల పాటు ఆఫర్ చేయనుంది. ''బోనస్ 30జీబీ'' ఉచిత డేటాను పొందాలంటే, ఎయిర్‌టెల్ పోస్టు పెయిడ్ యూజర్లు మైఎయిర్‌టెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అచ్చం మాన్‌సూన్ ఆఫర్ మాదిరిదైనా లేదా అనేది కంపెనీ తెలుపలేదు. ఎయిర్‌టెల్ తన మాన్‌సూన్ ఆఫర్ కింద ఎయిర్‌టెల్, తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు నెలకు 10జీబీ ఉచిత డేటా చొప్పున, మూడు నెలల పాటు అందిస్తోంది.