న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో అతి తక్కువ ధర 3,399 రూపాయలకే 4జీ స్మార్ట్‌ఫోన్లను ఆఫర్ చేయనున్నట్టు వెల్లడించింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ప్లాన్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై 2600 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. శాంసంగ్, వన్‌ప్లస్, షావోమి, హానర్, ఎల్‌జీ, లెనోవో, మోటో వంటి బ్రాండ్‌డ్ ఎక్స్‌క్లూజివ్ 4జీ స్మార్ట్‌ఫోన్లను ఈ ఆఫర్ కింద కస్టమర్లు కొనుగోలు చేసుకోవచ్చు.
కస్టమర్లకు లభ్యం కానున్న 2600 రూపాయల క్యాష్‌బ్యాక్‌లో 2000 రూపాయలను ఎయిర్‌టెల్ నుంచి పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఎయిర్‌టెల్ 36 నెలల్లో అందించనుంది. అదనంగా అందించే 600 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌పై చేసుకునే 169 రూపాయల ఎయిర్‌టెల్ రీఛార్జ్‌లపై ఆఫర్‌చేయనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మొత్తం డౌన్‌పేమెంట్ కట్టి పొందాల్సి ఉంటుంది.
అమెజాన్ ఇండియాతో చేసుకున్న తాము చేసుకున్న ఈ భాగస్వామ్యం కస్టమర్ల నుంచి సానుకూల స్పందన పొందుతున్న ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమానికి మరింత బూస్ట్‌ను ఇవ్వనుందని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమర్లకు తాము మరింత విలువైన సేవలను అందించనున్నామని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంతో స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో సరసమైన ధరల్లో 4జీ టెక్నాలజీని కస్టమర్లు ఆస్వాదించవచ్చని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ నూర్ పటేల్ తెలిపారు. పరిమితకాల వ్యవధిలో అన్ని అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు.
తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌లో 500 రూపాయలను పొందడానికి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన తొలి 18 నెలల కాలంలో 3500 రూపాయల విలువైన ఎయిర్‌టెల్ రీఛార్జ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 18 నెలల కాలంలో మరో 3500 రూపాయల విలువైన రీఛార్జ్‌లు చేయించుకోవాలి. దీంతో మరో 1500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఎయిర్‌టెల్ నుంచి పొందవచ్చు. అంటే మొత్తంగా 2000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు పొందుతారు. అదనంగా 600 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ నుంచి పొందవచ్చు. ఆ క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి అమెజాన్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 169 రూపాయలతో 24 ఎయిర్‌టెల్ రీఛార్జ్‌లు చేయించుకోవాలి. రీఛార్జ్ చేయించుకున్న ప్రతి నెలా 25 రూపాయల చొప్పున కస్టమర్ల అమెజాన్ పే బ్యాలెన్స్‌లో క్రెడిట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment