ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా కొనుగోలు రేసులో తాము లేమని చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ స్పష్టం చేశారు. తమది చాలా చిన్న సంస్థ అని.. ఎయిరిండియా లాంటి దిగ్గజాన్ని కొనేంత స్థాయి లేదని ఆయన వ్యాఖ్యానించారు.
‘ఎయిరిండియా జాతి సంపదలాంటిది. దాన్ని కొనుగోలు చేసేందుకు టాటా– విస్తారా, జెట్ ఎయిర్‌వేస్ లాంటి పెద్ద కంపెనీలున్నాయి. మాది చాలా చిన్న కంపెనీ. అంత భారీ సంస్థ కొనుగోలుకు బిడ్ చేసే స్థాయి మాకు లేదు‘ అని విమానయాన రంగ కన్సల్టెన్సీ కాపా ఏర్పాటు చేసిన వార్షిక ఏవియేషన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఎయిరిండియా ప్రైవేటీకరణ అంశాన్ని తాము కూడా మదింపు చేయాలనుకుంటున్నట్లు ఇటీవలే వెల్లడించిన అజయ్ సింగ్ తాజాగా అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం. టాటాల సారధ్యంలోని విస్తారా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలు ఎయిరిండియా కొనుగోలు రేసులో పోటీపడుతున్నాయంటూ కాపా వెల్లడించిన వేదికపైనే అజయ్ సింగ్ తాజా వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నాలుగు కంపెనీలతో పాటు రెండు విదేశీ విమానయానేతర సంస్థలు కూడా బరిలో ఉన్నాయని కాపా ఒక నివేదికలో పేర్కొంది. ఎయిరిండియా ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చే నెల మధ్యలో బిడ్లను ఆహ్వానించవచ్చని, విక్రయ ప్రక్రియ జూలై నాటికల్లా పూర్తి కావొచ్చని కాపా భారత విభాగం హెడ్ కపిల్ కౌల్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment