ముంబై : కొన్ని రూ.10 నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న పుకార్లపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టతనిచ్చింది. 14 డిజైన్లలో ఉన్న అన్ని రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని, లావాదేవీలకు లీగల్ టెండర్‌గా వీటిని కొనసాగించవచ్చంటూ ఆర్‌బీఐ బుధవారం వెల్లడించింది. కొంతమంది ట్రేడర్లు ఈ నాణేలను తిరస్కరిస్తున్న క్రమంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లోని ట్రేడర్లు, ప్రజలు రూ.10 నాణేలను అంగీకరించడం లేదని తమ దృష్టిలోకి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. పలు డిజైన్లలో ఉన్న అన్ని నాణేలకు చట్టబద్దమైన స్టేటస్ కొనసాగుతుందని పేర్కొంది.
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలతో కూడిన పలు అంశాలను ప్రతిబింబించేలా వివిధ ఫీచర్లను ఈ నాణేలు కలిగి ఉన్నాయని, ఎప్పటికప్పుడూ వీటిని ప్రవేశపెడుతున్నామని ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 14 డిజైన్లలో రూ.10 నాణేలను ఆర్‌బీఐ ప్రవేశపెట్టిందని, ఈ నాణేలన్నీ చట్టబద్ధంగానే కొనసాగుతాయని, వీటిని లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బ్యాంకులు కూడా ఈ నాణేలను స్వీకరించాలని, బ్రాంచుల వద్ద వీటిని మార్చుకోవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment