ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేశాక పునర్వ్యస్థీకరణ పూర్తిచేసుకున్న అలోక్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి లిస్టయ్యింది. తదుపరి మార్కెట్లతోపాటే భారీ హెచ్చుతగ్గులను చవిచూస్తోంది. ఇక మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం..
అలోక్ ఇండస్ట్రీస్
టెక్స్‌టైల్ రంగంలో సమీకృత కార్యకలాపాలు కలిగినప్పటికీ భారీ రుణాలు, నష్టాలతో దివాళా బాట పట్టిన అలోక్ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల వెలుగులో నిలుస్తోంది. జేఎం ఫైనాన్షియల్ అసెట్ రీకన్‌స్ట్రక్ణన్ కంపెనీతో కలసి డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాదిలో అలోక్‌ను కొనుగోలు చేసింది. ఈ సంస్థలు సంయుక్తంగా వేసిన రూ. 5050 కోట్ల బిడ్‌ను 2019 మార్చిలో ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. ఈ నేపథ్యంలో పునర్వ్యస్థీకరణ పూర్తిచేసుకున్న అలోక్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ఫిబ్రవరి 27న రూ. 14 వద్ద తిరిగి లిస్టయ్యింది. తదుపరి మార్చి 31కల్లా ఈ షేరు రూ. 3.92కు పతనమైంది. తదుపరి మార్కెట్లతోపాటు జోరందుకుంది. వరుసగా 17 రోజులపాటు అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వచ్చింది. తాజాగా ఎన్ఎసఈలో మరోసారి 5 శాతం ఎగసి రూ. 16.85 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి మార్చి 31 కనిష్టం నుంచి 330 శాతం ర్యాలీ చేసింది. ఈ మార్చికల్లా అలోక్ ఇండస్ట్రీస్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 37.7 శాతం వాటాను కలిగి ఉంది. సంపన్నవర్గాలు, రిటైలర్లు 45.67 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
ఉజ్జీవన్ ఫైనాన్స్
ఎన్‌బీఎఫ్‌సీ.. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 77 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 80 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 590 కోట్ల నుంచి రూ. 805 కోట్లకు ఎగసింది. కాగా.. కోవిడ్-19 నేపథ్యంలో అనుబంధ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రభావితంకానున్నట్లు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా పేర్కొంది. దీంతో భవిష్యత్‌లో పనితీరుపట్ల ప్రస్తుతం అంచనాలను వెల్లడించలేమని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ షేరు 9.5 శాతం జంప్‌చేసి రూ. 171 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 176ను సైతం అధిగమించింది. కాగా ఫిబ్రవరి మొదటి వారంలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 415 నుంచి ఈ కౌంటర్ 50 శాతం పతనంకావడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment