న్యూఢిల్లీ: అమెజాన్ ఉత్పత్తులు మీకు సమీపంలోని మాల్‌లోనూ అమ్ముతుంటే... అప్పుడు తప్పకుండా వెళ్లి చూసి మరీ కొంటారు. ఈ అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశీయ ఈ కామర్స్‌లో బలమైన ప్రదర్శన చూపుతున్న అంతర్జాతీయ రిటైల్ సంస్థ అమెజాన్, భారత్‌లో ఆఫ్‌లైన్ దుకాణాలనూ చేరుకోవాలని ప్రణాళికలు వేసుకుంది. అంటే అటు ఆన్‌లైన్‌లో లభించే అమెజాన్ ఉత్పత్తులు, ఇటు ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటాయి. దీంతో మరింత మంది వినియోగదారులను చేరుకునే అవకాశం కంపెనీకి లభిస్తుంది. కస్టమర్లకు ఈ విధంగా సమగ్రమైన షాపింగ్ అనుభవాన్ని ఇవ్వడం ద్వారా... ఇదే నమూనాలో పోటీకి సిద్ధమవుతున్న రిలయన్స్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌లతో గట్టిగా తలపడొచ్చన్నది అమెజాన్ వ్యూహంగా తెలుస్తోంది.
2,000కుపైగా దుకాణాల్లో...
తన ప్రణాళికను అమలు చేయడంలో భాగంగా అమెరికా కంపెనీ అమెజాన్ ఇప్పటికే ఫ్యూచర్ గ్రూపు, మోర్, షాపర్స్ స్టాప్‌తో చర్చలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీల్లో అమెజాన్‌కు వాటాలు కూడా ఉన్నాయి. మోర్‌లో అయితే 49 శాతం వరకు ఉండగా, మిగిలిన రెండింటిలో స్వల్ప వాటాలను కొనుగోలు చేసింది. దీని వెనుక ఆఫ్‌లైన్‌లోనూ విస్తరించాలన్నదే కంపెనీ లక్ష్యం. అమెజాన్ భారత ఈ కామర్స్ పోర్టల్‌లో లభించే ఎన్నో రకాల ఉత్పత్తులు ఫ్యూచర్ రిటైల్, మోర్, షాపర్స్ స్టాప్ దుకాణాల్లోనూ విక్రయానికి ఉంచాలన్నది అమెజాన్ వ్యూహమని పరిశ్రమకు చెందిన వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా అమెజాన్ తన ప్రైవేటు లేబుల్ (తన సొంత బ్రాండ్లకు చెందినవి) ఉత్పత్తులను విక్రయానికి ఉంచాలనుకుంటోంది. ఆ తర్వాత అమెజాన్ ఈ కామర్స్‌లో అధికంగా అమ్ముడయ్యే అన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్మకాలు సాగించే అమెజాన్ బేసిక్స్ (అమెజాన్ ప్రైవేటు లేబుల్) ఉత్పత్తులను ఫ్యూచర్ రిటైల్, మోర్, షాపర్స్‌స్టాప్‌కు చెందిన మొత్తం 2,000కు పైగా దుకాణాల్లో విక్రయానికి పెట్టనుంది.
విస్తృతమైన ఉత్పత్తులు...
అమెజాన్ బేసిక్స్ పేరుతో ఏసీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, హెచ్‌డీఎంఐ కేబుళ్లు, బ్యాటరీలు, బెడ్‌షీట్లు, టవళ్లు, డిన్నర్ ప్లేట్లు, కట్లరీ, గొడుగులు, బ్యాగులు ఇతర ఉత్పత్తులను అమెజాన్ సంస్థ విక్రయిస్తోంది. ప్రౌల్, జస్ట్ ఎఫ్ అనే రెండు బ్రాండ్ల పేరిట వస్త్రాలను షాపర్స్ స్టాప్ దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తోంది. ఇకపై దీన్నే మరింత విస్తృతం చేయనుంది. అంతేకాదు, కిరాణా, ఫ్యాషన్ ప్రైవేటు బ్రాండ్లను కూడా అమెజాన్ తీసుకురానుంది. అయితే, ఈ ప్రణాళికలపై అమెజాన్ కానీ, ఈ సంస్థకు వాటాలున్న రిటైల్ సంస్థలు కానీ స్పందించలేదు. అయితే, ఓ రిటైల్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాత్రం... అమెజాన్‌తో జరిగిన షేరు కొనుగోళ్ల ఒప్పందంలో ఆ సంస్థ ఉత్పత్తుల విక్రయాలను చేపట్టాలన్న నిబంధన లేదని స్పష్టం చేశారు. అయితే, అమెజాన్ ఆన్‌లైన్ ఉత్పత్తులను విక్రయించే అవకాశం అయితే ఉందని సంకేతాన్నిచ్చారు.
అమెజాన్ పే సేవలు...
అమెజాన్‌తో ఒప్పందంలో భాగంగా... షాపర్స్‌స్టాప్, మోర్, ఫ్యూచర్ గ్రూపు ఇప్పటికే తమ ఉత్పత్తులను అమెజాన్ ఈ కామర్స్ పోర్టల్‌తోపాటు హైపర్ లోకల్ ప్లాట్‌ఫామ్ ‘ప్రైమ్‌నౌ’పై విక్రయాలు చేస్తున్నాయి. అలాగే, అమెజాన్ పే చెల్లింపుల సేవలను మోర్, షాపర్స్ స్టాప్ దుకాణాల్లో అనుమతిస్తున్నాయి. త్వరలో బిగ్‌బజార్, ఈజీడే దుకాణాల్లోనూ అమెజాన్ పే సేవలు ఆరంభం కానున్నాయి. తన ఉత్పత్తులను విక్రయానికి ఏ విధంగా స్టోర్లను వినయోగించుకోవచ్చన్న దానిపై వాటి అభిప్రాయాలను అమేజాన్ కోరినట్టు ఈ చర్చల్లో భాగం పంచుకుంటున్న ఓ ఉద్యోగి తెలిపారు. ఆఫ్‌లైన్ స్టోర్లలో అమెజాన్ తన ఉత్పత్తులను ఆకర్షణీయమైన ధరలకు విక్రయించే వ్యూహంతో ఉందని సంకేతమిచ్చారు. అంటే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించే ధరలనే ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఉండేలా చూడనున్నట్టు చెప్పారు. అమెజాన్ పెద్ద ఎత్తున స్థానం కోసం చూస్తోందని, దీంతో ప్రస్తుతానికి అయితే ఈ ఉత్పత్తులపై మార్జిన్ చాలా స్వల్పంగానే ఉంటోందని తెలిపారు.
వ్యూహాత్మక పెట్టుబడులు
గత నెలలోనే ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటా కొనుగోలుకు అమెజాన్ ఒప్పందం చేసుకున్న విషయం గమనార్హం. ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్ కూపన్స్‌కు వాటాలున్నాయి. ఇది ఫ్యూచర్ గ్రూపు ప్రమోటర్లకు చెందిన సంస్థ. ఫ్యూచర్ గ్రూపు బిగ్‌బజార్, హెరిటేజ్ తదితర బ్రాండ్లతో 1,400కుపైగా రిటైల్ దుకాణాలను నిర్వహిస్తోంది. అలాగే, ఏడాది క్రితం మోర్ రిటైల్‌ను అమెజాన్ కొనుగోలు చేసింది. సమారా క్యాపిటల్‌తో కలసి మోర్‌లో మెజారిటీ వాటాలను సొంతం చేసుకుంది. మోర్‌కు దేశవ్యాప్తంగా 620 స్టోర్లు ఉన్నాయి. 2017లో షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాలను కూడా కొనుగోలు చేసింది. షాపర్స్ స్టాప్‌కు 83 స్టోర్లు ఉన్నాయి. ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్ వరకు అన్ని చోట్లా ఉత్పత్తులను విక్రయించడమే దేశంలో బడా రిటైల్ సంస్థలకు భవిష్యత్తు రిటైల్ వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా పెద్ద ఎత్తున వినియోగదారులను చేరుకోవచ్చని భావిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో భారీగా విస్తరించిన రిలయన్స్ రిటైల్ త్వరలో ఈ కామర్స్‌లోకీ అడుగుపెట్టే ప్రణాళికలతో ఉంది. దీంతో అమెజాన్ ముందుగానే ఈ విభాగంలో బలమైన స్థానం దిశగా అడుగులు వేస్తున్నట్టు ఈ పరిణామాలను చూస్తే తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment