e commerce india
-
కొనుగోలు దారులకు బంపరాఫర్, స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. రెండు రోజుల పాటు నిర్వహించే సేల్‌లో పలు ప్రొడక్ట్‌లను భారీ డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు ప్రకటించింది. జులై23, జులై 24న అమెజాన్ నిర్వహించే ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, అప్లయన్సెస్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ, గ్రాసరీస్, అమెజాన్ డివైజెస్, హోం అండ్ కిచెన్, ఫర్మీచర్తో పాటు ప్రతి రోజు ఇంట్లో వినియోగించే నిత్యవసర వస్తువులపై భారీ ఆఫర్లు వర్తిస్తాయని చెప్పింది. అమెజాన్ నిర్వహించే ఈ సేల్‌లో సుమారు 400కి పైగా బ్రాండ్ అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రైమ్ డైరెక్టర్ అక్షయ్ సాహి తెలిపారు. జులై 23 12.00 ఏఎం నుంచి జులై 24 అర్ధరాత్రి 11.59గంటల వరకు సేల్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో 400జాతీయ,అంతర్జాతీయ సంస్థలకు చెందిన 30వేలకు పైగా ఉత్పత్తుల్ని అమ్మకానికి ఉంచుతున్నట్లు అక్షయ్ సాహి చెప్పారు. అమెజాన్ ఈకో, ఫైర్ టీవీ, కిండెల్స్ డివైజ్‌తో పాటు స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్ప్లే, ఫైర్ టీవీ వంటి ప్రొడక్ట్‌లపై 55శాతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్యూమా సంచలన నిర్ణయం.. ఇండియాలో తొలిసారిగా..
జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇతర యూరప్ దేశాలను కాదని తొలిసారిగా ఆన్లైన్ షాపింగ్ కోసం ఇండియాలో యాప్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్యూమాకు అనేక దేశాల్లో ఈ కామర్స్ కోసం ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి కానీ యాప్ లేదు. మొబైల్ యూజర్ల గణనీయంగా పెరగడంతో యాప్ రిలీజ్ చేయాలని ప్యూమా నిర్ణయించుకుంది. ఇందుకు ఇండియాను వేదికగా చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్యూమాకు ఉన్న అతి పెద్ద మార్కెట్లలో ఇండియా ఒకటి. 2021 డిసెంబరు వరకు ప్యూమా ఇండియాలో రూ.2,044 రెవెన్యూ సాధించింది. అంతకు ముందు ఏడాది 2020తో పోల్చితే ఇది 68 శాతం అధికం. ఇండియాలో తమ బ్రాండ్‌కి ఉన్న ఆదరణ గమనించిన ప్యూమా ఇక్కడే తమ యాప్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్యూమాకి దేశశ్యాప్తంగా 450 స్టోర్లు ఉన్నాయి. ఇందులో 51 స్టోర్లు గతేడాదే ప్రారంభం అయ్యాయి. ఇండియాలో తమ ప్యూమా నంబర్ వన్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా ఉందని ఆ కంపెనీ సీఈవో జార్న్ గుల్డెన్ అన్నారు. అందుకే ఇండియాలో భారీ ఎత్తున విస్తరించే యోచనలో ప్యూమా ఉన్నట్టు తెలిపారు. యాప్ ప్రారంభమైతే ప్యూమా ఉత్పత్తలు మరింత వేగంగా వినియోగదారులకు అందుతాయని ప్యూమా ఇండియా హెడ్ అభిషేక్ గంగూలీ అన్నారు. చదవండి: ‘అవమానాలు భరించలేక కిటికిలోంచి దూకేద్దాం అనుకున్నా’ -
కొంప ముంచుతున్న ఆఫర్లు! మా ప్రాణాలు ఫణంగా పెట్టి వ్యాపారం చేస్తారా?
ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయాక మన దేశంలో ఈ కామర్స్ రంగం ఆకాశమే హద్దుగా వృద్ధి చెందుతోంది. ఇక కరోనాతో ఫిజికల్ డిస్టెన్సింగ్ వంటివి జన జీవితంలో భాగమయ్యాక డిజిటల్ సర్వీసెస్‌కి గిరాకీ పెరిగింది. దీంతో అనేక కంపెనీలు ఈ కామర్స్‌లోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరంగా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పాలు, కూరగాయలు మొదలు ఉప్పు, పప్పు, సోపు, షాంపూ వరకు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ రంగంలో ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జియోమార్ట్ వంటి ప్రముఖ సంస్థలు గ్రోసరీస్ డోర్ డెలివరీ సర్వీస్‌లు అందిస్తున్నాయి. వీటికి పోటీగా అనేక స్టార్టప్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ, గురగ్రామ్ ప్రాంతాల్లో బ్లింకిట్, జెప్టో వంటి ఈ కామర్స్ సైట్స్ ప్రారంభమయ్యాయి. మార్కెట్లో పాగా వేసేందుకు పోటీ కంపెనీల కంటే భిన్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పది నిమిషాల్లోనే సబ్బు, సర్ఫ్, పాలు, కాఫీ ఏదైనా సరే ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మీకు హోం డెలివరీ చేస్తామంటూ బ్లింకిట్, జెప్టోలు ప్రకటించాయి. ఆర్డర్ చేసిన క్షణం నుంచి పది నిమిషాలు ముగిసేలోగా నిజంగానే కష్టమర్లకు ఆర్డర్లను చేరవేస్తున్నాయి కూడా. ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో కాలంలో పోటీ పడి పని చేసే టెకీలు ఈ సర్వీసుల పట్ల ఆకర్షితులు అవుతున్నాయి. యూరప్, అమెరికా లాంటి దేశాలకే ఈ స్పీడ్ డెలివరీ సర్వీస్ సాధ్యమని అనుకున్నాం, కానీ మన దగ్గర కూడా టెన్ మినిట్స్ డెలివరీ వచ్చిందంటూ ఈ స్పీడ్‌ను స్వాగతిస్తున్నారు. రద్దు చేయండి మరోవైపు పది నిమిషాల్లో డెలివరీ సర్వీసు తమ ప్రాణాల మీదకు వచ్చిందంటున్నారు డెలివరీ బాయ్స్. పేరు చెప్పడానికి డెలివరీ బాయ్స్ తాము పడుతున్న ఇబ్బందులను రాయిటర్స్ దృష్టికి తీసుకెళ్లారు. తద్వారా ఈ అంశం జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. గుంతలమయంగా ఉండే రోడ్లు, ఇరుకు గల్లీలు, తరచుగా జరిగే ర్యాలీలు, ట్రాఫిక్ కష్టాలు వంటి స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పది నిమిషాల డెలివరీ సర్వీసును రద్దు చేయాలని కోరుతున్నారు. రేసింగ్లా ఉంది డెలివరీ బాయ్స్ చెబుతున్న వివరాల ప్రకారం.. ఆర్డర్ బుక్ చేసిన తర్వాత సదరు వస్తువును ప్యాక్ చేసుకుని డాక్యుమెంట్ వర్క్ పూర్తి చేయడానికే రెండు నుంచి మూడు నిమిషాల సమయం పడుతుంది. అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరుకునేందుకు కేవలం 5 నుంచి 7 నిమిషాల సమయమే మిగిలి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో డెలివరీ అందించేందుకు ఎంతో స్పీడ్‌గా డ్రైవ్ చేయాల్సి వస్తుందంటున్నారు. తాము రేసింగ్‌లో పాల్గొంటున్నట్టుగా బైకులు నడుపుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదంలో పడ్డారని, అదృష్టవశాత్తు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెబుతున్నారు. లేటయినా పర్వాలేదు డెలివరీ బాయ్స్ ఆందోళన ఇలా ఉంటే ఈ కామర్స్ ప్రతినిధుల వాదన మరోలా ఉంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు పది నిమిషాల డెలివరీ సర్వీసును అందిస్తున్నాం. ఈ సర్వీస్‌కి కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. కచ్చితంగా పది నిమిషాల్లోనే వెళ్లాలని అనే నిబంధన ఏమీ డెలివరీ బాయ్స్‌కి పెట్టడం లేదు. ఆలస్యమయితే ఎలాంటి ఫైన్లు విధించడం లేదు. కస్టమర్లను త్వరగా సేవలు అందివ్వడమే తమ లక్ష్యమని చెబుతున్నాయి. వాస్తవంలో అలా లేదు పది నిమిషాల్లో డెలివరీ చేయకపోయినా పర్వాలేదంటూ కంపెనీ ప్రతినిధులు చెబుతున్న మాటలు అబద్దం అంటున్నారు డెలివరీ బాయ్స్. సకాలంలో ఆర్డర్‌ని అందివ్వకపోతే చాలా మందికి రోజువారి జీతంలో రూ.300ల వరకు కోత విధిస్తున్నారని, తమని నొప్పించేలా స్టోర్ మేనేజర్లు మాట్లాడుతున్నారని డెలివరీ బాయ్స్ అంటున్నారు. మొదలైన చర్చ ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా ఇండియా ఉంది. ఇక్కడ ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. సగటున ఏడాదికి లక్షన్నర మంది చనిపోతున్నారు. మరోవైపు ఇండియాలో ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. దీంతో బడా కార్పోరేట్ కంపెనీలకు తోడు స్టార్టప్‌లు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ తరుణంలో డెలివరీ బాయ్స్లు పడుతున్న ఇబ్బందులపై చర్చ మొదలైంది. రోడ్ సెఫ్టీ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆఫర్లు ప్రకటించాలని డెలివరీ బాయ్స్ అంటున్నారు. చదవండి: డెలివరీబాయ్ దుర్మరణం.. జొమాటో స్పందన ఇది -
థర్డ్‌వేవ్ ముంగిట!.. ఊపందుకున్న ఈ-కామర్స్
లక్ష కొత్త కేసుల నమోదుతో భారత్ కరోనా మూడో వేవ్‌లోకి ప్రవేశించిందన్న సంకేతాలు మొదలయ్యాయి. భారీగా పెరిగిపోతున్న కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ భయాందోళనలు, టైం పరిమితుల నడుమ ఫిజికల్ స్టోర్ల ముందు క్యూ కట్టే జనం తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఈ-కామర్స్ వెబ్సైట్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో నిత్యావసరాల అమ్మకాలు గత వారం రోజులుగా జోరుగా నడుస్తున్నాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే ఒమిక్రాన్ ఫియర్‌తో పాటు ప్రభుత్వ ఆంక్షలు, వారాంతపు కర్ఫ్యూ-లాక్డౌన్ల నేపథ్యంలో ప్రజలు షాపుల ముందు క్యూ కట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, సబ్బుల ఇతరత్రాల అమ్మకాలు ఆన్లైన్ ఆర్డర్ల రూపంలో పెరిగిపోతున్నాయి. మరోసారి ప్రభుత్వాల ఆంక్షలతో ఫిజికల్ ఎకానమీ యాక్టివిటీకి అవాంతరం ఎదురుకాగా.. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ ఈ-కామర్స్ ఛానెల్స్ ముందుకు వచ్చాయి. అమెజాన్ ఇండియాతో పాటు బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లలో డిమాండ్ ఇప్పటికే మొదలైంది. కర్ఫ్యూ, లాక్డౌన్ విధించే ఆస్కారం ఉందన్న అనుమానంతో నిల్వలకు సిద్ధపడుతున్నారు మరికొందరు. గత వారంలోనే 10 నుంచి 15 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఆయా ప్లాట్‌ఫామ్స్ ప్రకటించుకున్నాయి. ఇక ఈ వారం వ్యవధిలో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఎక్కువగా డిమాండ్ ఉంటున్న ఉత్పత్తులు చాక్లెట్, శీతల పానీయాలకు సంబంధించినవి కావడం విశేషం. హైజీన్ ఉత్పత్తులు కూడా రెండో వేవ్ ఉధృతి తగ్గాక ఊసే లేకుండా పోయిన హైజీన్ ఉత్పత్తులకు మళ్లీ టైం మొదలైంది. శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు, క్లీనింగ్ లిక్విడ్స్, డిస్ఇన్ఫెక్టెడ్ సొల్యూషన్స్, ఎన్95 మాస్కులు, ఇతర మాస్కులకు డిమాండ్ మొదలైంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తోనే ఈ ఊపు వస్తోందని తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లు సప్లయి కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. మెట్రో సిటీ, సిటీ, టౌన్లలో ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలను, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నివేదికను ఈ-కామర్స్ పోర్టల్స్ వెల్లడించాయని గమనించగలరు. -
అమెజాన్‌కి చెక్ పెట్టే పనిలో టాటా గ్రూపు.. మొదలైన గ్రౌండ్ వర్క్
Super App:ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు భారతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జియో మార్ట్ పనుల్లో రిలయన్స్ గ్రూపు బిజీగా ఉండగా తాజాగా టాటా సైతం రంగంలోకి దిగింది. రాబోయే రోజుల్లో ఈ కామర్స్ సెక్టార్లో గట్టి పోటీ నెలకొనబోతుంది. అమెజాన్‌కి పోటీ ఇచ్చేందుకు ఇండియన్ బిజినెస్ టైకూన్లు రెడీ అవుతున్నారు. వాట్సాప్‌తో కలిసి జియోమార్ట్ పేరుతో ఈ కామర్స్‌లో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ రెడీ అవగా ఇప్పటికే బిగ్ బాస్కెట్‌ను టాటాగ్రూపు కొనుగోలు చేసింది పోటీకి రెడీ అవుతోంది. టాటా గ్రూపుకు సంబంధించి అపరెల్స్ విభాగంలో టాటా క్లిక్ యాప్ ఇప్పటికే ఉంది. అయితే కూరగాయలు, కిరాణ మొదలు ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్స్ వరకు అన్ని వస్తువులను ఆన్లైన్లో అమ్మేలా టాటా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా సూపర్ యాప్ పేరుతో టాటా ఈ కామర్స్ రంగంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సూపర్ యాప్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ముందు ఓ సారి టెస్ట్ డ్రైవ్ చేసే ఆలోచనలో టాటా ఉంది. దీంతో టాటా గ్రూపుకి సంబంధించిన ఎంప్లాయిస్ ద్వారా ఆ పని చేయాలని నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టాటాగ్రూపుకు సంబంధించి వివిధ కంపెనీల్లో దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడు లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరందరినీ సూపర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని టాటా సంస్థ కోరనుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో భారీ ఎత్తున ఈ కామర్స్ సైట్‌ను ప్రారంభించాలని టాటా నిర్ణయించింది. అంతకంటే ముందు తమ ఉద్యోగుల ద్వారా టెస్ట్ డ్రైవ్ నిర్వహించి లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు మరింత మెరుగైన సేవలు అందిందేలా ప్రణాళిక రూపొందిస్తోంది. -
డీల్‌షేర్ నుంచి 4,000 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: సోషల్ కామర్స్ కంపెనీ డీల్‌షేర్ రానున్న ఆరు నెలల్లో కొత్తగా 4,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రస్తుతమున్న 1,000 మంది సిబ్బందిని 5,000కుపైగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. కార్యకలాపాలను భారీస్థాయి లో విస్తరించేందుకు వీలుగా 10 కోట్ల డాలర్లు (రూ. 736 కోట్లు) సైతం ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా వివిధ విభాగాలలో వేగంగా విస్తరించాలని చూస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇటీవలే టైగర్ గ్లోబల్, వెస్ట్బ్రిడ్జి క్యాపిటల్, అల్ఫావేవ్ ఇన్క్యుబేషన్ తదితర దిగ్గజాల నుంచి 14.4 కోట్ల డాలర్లు సమీకరించింది. కోవిడ్–19 సవాళ్లు విసిరినప్పటికీ కస్టమర్ బేస్ భారీగా ఎగసినట్లు డీల్‌షేర్ వ్యవస్థాపకుడు, సీఈ వో వినీత్ రావు తెలియజేశారు. ప్రస్తుతం స్థూల మెర్కండైజ్ విలువ(జీఎంవీ) 40 కోట్ల డాలర్ల రన్‌రేట్‌ను తాకినట్లు వెల్లడించారు. 5 రాష్ట్రాలలో 45 పట్టణాలలో విస్తరించినట్లు తెలియజేశారు. ఈ ఏడాది చివరికల్లా 100 కోట్ల డాలర్ల జీఎంవీ రన్‌రేట్‌ను అందుకోగలమన్న విశ్వాసా న్ని వ్యక్తం చేశారు. నిర్వహణ సామర్థ్యం, ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ, డేటా సైంటిస్టులు, మార్కెటింగ్, పంపిణీ తదితర విభాగాల లో కొత్త ఉద్యోగాల కల్పన ఉంటుందని వెల్లడించారు. -
Infosys: ఈ కామర్స్ స్పెషల్.. ఈక్వినాక్స్ సొల్యూషన్స్
న్యూఢిల్లీ: కంపెనీలు తమ డిజిటల్ వాణిజ్య సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా ఈక్వినాక్స్ పేరిట కొత్త సొల్యూషన్స్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. గడిచిన రెండేళ్లుగా ప్రయోగదశలో దీనికి మంచి స్పందన వచ్చిందని ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్మేష్ వాస్వాని తెలిపారు. ఈ రంగాలకు అనువుగా ప్రస్తుతం ఏటా 15 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ–కామర్స్ లావాదేవీల నిర్వహణకు పలు అంతర్జాతీయ సంస్థలు దీన్ని ఉపయోగిస్తున్నాయని కర్మేష్ వాస్వాని పేర్కొన్నారు. రిటైల్, టెలికం, ఆటోమోటివ్, తయారీ, మీడియా స్ట్రీమింగ్ తదితర సంస్థల కోసం ఈక్వినాక్స్ అనువుగా ఉంటుందని వాస్వాని వివరించారు. ఇన్ఫీ ఆదాయంలో దాదాపు 15 శాతం వాటా ప్రస్తుతం రిటైల్ విభాగానిదే ఉంటోంది. అటు డిజిటల్ టెక్నాలజీ సంబంధ సర్వీసులు, సొల్యూషన్స్ వాటా 48.5 శాతంగా ఉంది. చాలా మటుకు కంపెనీలకు డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఉన్నప్పటికీ.. చురుగ్గా వ్యవహరించగలిగే చిన్న స్థాయి డిజిటల్ సంస్థల నుంచి వాటికి ముప్పు పొంచి ఉందని వాస్వాని వివరించారు. వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు పెద్ద కంపెనీలు ..సంక్లిష్టమైన తమ ప్లాట్‌ఫాంలను సులభతరంగా మార్చుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం ఈక్వినాక్స్ ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్! -
వేర్‌హౌస్ స్పేస్‌కు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ–కామర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పీఎల్) శరవేగంగా విస్తరిస్తుండటంతో గిడ్డంగులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది జనవరి–జూన్ (హెచ్1) నాటికి హైదరాబాద్‌లో 2.1 కోట్ల చ.అ. వేర్‌హౌస్ స్టాక్ ఉందని సీబీఆర్ఈ సౌత్ ఆసియా తెలిపింది. ఇందులో 43 శాతం వేర్‌హౌస్ స్థలాన్ని రిటైల్ సంస్థలు, 19 శాతం 3 పీఎల్, 15 శాతం ఈ–కామర్స్ కంపెనీల వాటాలున్నాయని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో అదనంగా 50 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ చేరుతుందని అంచనా వేసింది. కొన్ని కంపెనీలు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది హెచ్1లో నగరంలో గిడ్డంగుల అద్దెలు 5–14 శాతం వరకు పెరుగుతాయని పేర్కొంది. 2018–2021 హెచ్1 నాటికి నగరంలో 1.1 కోట్ల చ.అ.లుగా ఉంది. టీఎస్ఐపాస్, పారిశ్రామిక ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి వంటివి రాష్ట్రంలో గిడ్డంగుల వృద్ధికి ప్రధాన కారణాలని తెలిపింది. చదవండి: ఆగస్ట్‌లో రూ.2,150 కోట్ల రుణాలు -
E-Commerce : టాటా డిజిటల్ దూకుడు
వెబ్‌డెస్క్ : టాటా గ్రూప్... దేశ పారిశ్రామిక రంగంలో పరిచయం అక్కర్లేని సంస్థ. దేశంలోని తొలి ఇండస్ట్రియల్ సంస్థల్లో ఒకటైన టాటా ఇప్పుడు ఈ కామర్స్‌పై దృష్టి పెట్టింది. ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న స్టార్ట్అప్ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టబడులు పెడుతోంది. తాజాగా ఈ ఫార్మసీ, ఈ హెల్త్ సెక్టార్లలో దూసుకుపోతున్న 1 ఎంజీ సంస్థలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. రూ. 5,473 కోట్లు దేశంలో ఆన్లైన్ హెల్త్, ఫార్మసీ రంగాల్లో దూసుపోతున్న 1 ఎంజీ సంస్థలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నట్టు టాటా డిజిటల్ ప్రకటించింది. ఎంజీలోకి టాటా రావడం వల్ల వినియోగదారులకు అత్యుత్తమ స్థాయిలో నాణ్యతతో కూడిన సేవలు అందుతాయని టాటా డిజిటల్ సీఈవో ప్రతిక్పాల్ తెలిపారు. ఈ ఫార్మసీ సేవలు అందిస్తోన్న 1 ఎంజీ సంస్థను 2015 నెలకొల్పారు. ప్రస్తుతం దేశంలో 20 వేలకు పైగా పిన్కోడ్లకు 1 ఎంజీ సంస్థ మెడిసిన్స్ డెలివరీ చేయగలుగుతోంది. టాటా డిజిటల్ చేరికతో ఈ గ్రూపు సేవలు మరింతగా విస్తరించనున్నాయి. బిగ్ బాస్కెట్లోనూ ? 1 ఎంజీలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు వారాల ముందే మరో ఆన్లైన్ ఫ్లాట్‌ఫారమ్ బిగ్ బాస్కెట్‌పై దృష్టి పెట్టింది టాటా డిజిటల్. బిగ్‌బాస్కెట్‌లో ఏకంగా 64 శాతం వాటాను రూ.9500 కోట్లు వెచ్చించి టాటా డిజిటల్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. బిగ్‌బాస్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు పోటీగా తాను కూడా ఈ గ్రోసరీ మార్కె్టోలకి అడుగుపెట్టబోతున్నట్టు టాటా డిజిటల్ సంకేతాలు ఇచ్చింది. అయితే బిగ్‌బాస్కెట్ గ్రూపులో పెట్టుబడులపై టాటా డిజిటల్ సంస్థ మౌనం పాటిస్తోంది. అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఈ కామర్స్‌పై దృష్టి ఇండస్ట్రియల్ సెక్టా్ర్ పేరు చెబితే మొదటగా వినిపించే పేర్లలలో టాటా గ్రూపు ఒకటి. అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూపు ఈ కామర్స్‌పై ఇంత కాలం పెద్దగా దృష్టి పెట్టలేదు. రోజురోజుకి ఈ కామర్స్ రంగంలో వృద్ధి రేటును గమనించిన టాటా తాజాగా ఈ రంగంపై దృష్టి సారించింది. దీంతో టాటా డిజిటల్‌ను ముందుంచి వరుసగా ఈ కామర్స్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది. -
వాల్‌మార్ట్ రూ.1,616 కోట్ల పెట్టుబడి
వాల్‌మార్ట్‌కు చెందిన భారత ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఈ పండుగల సీజన్ కోసం తన మాతృసంస్థ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడిని అందుకుంది. సింగపూర్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలో రూ.1,616 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ)కి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఇందుకోసం భారత సంస్థ తనకు 4,64,403 ఈక్విటీ షేర్లను (ఒక్కో షేరు విలువ రూ.34,800) జారీ చేసినట్లు పేర్కొంది. ఈఏడాది జనవరిలో రూ.1,431 కోట్లను పెట్టుబడి పెట్టగా.. ఇది ప్రస్తుత ఏడాదిలో రెండో విడత పెట్టుబడిగా వెల్లడించింది. -
అమెజాన్ ఆఫ్‌లైన్
న్యూఢిల్లీ: అమెజాన్ ఉత్పత్తులు మీకు సమీపంలోని మాల్లోనూ అమ్ముతుంటే... అప్పుడు తప్పకుండా వెళ్లి చూసి మరీ కొంటారు. ఈ అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశీయ ఈ కామర్స్‌లో బలమైన ప్రదర్శన చూపుతున్న అంతర్జాతీయ రిటైల్ సంస్థ అమెజాన్, భారత్‌లో ఆఫ్‌లైన్ దుకాణాలనూ చేరుకోవాలని ప్రణాళికలు వేసుకుంది. అంటే అటు ఆన్లైన్లో లభించే అమెజాన్ ఉత్పత్తులు, ఇటు ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉంటాయి. దీంతో మరింత మంది వినియోగదారులను చేరుకునే అవకాశం కంపెనీకి లభిస్తుంది. కస్టమర్లకు ఈ విధంగా సమగ్రమైన షాపింగ్ అనుభవాన్ని ఇవ్వడం ద్వారా... ఇదే నమూనాలో పోటీకి సిద్ధమవుతున్న రిలయన్స్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌లతో గట్టిగా తలపడొచ్చన్నది అమెజాన్ వ్యూహంగా తెలుస్తోంది. 2,000కుపైగా దుకాణాల్లో... తన ప్రణాళికను అమలు చేయడంలో భాగంగా అమెరికా కంపెనీ అమెజాన్ ఇప్పటికే ఫ్యూచర్ గ్రూపు, మోర్, షాపర్స్ స్టాప్‌తో చర్చలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీల్లో అమెజాన్‌కు వాటాలు కూడా ఉన్నాయి. మోర్లో అయితే 49 శాతం వరకు ఉండగా, మిగిలిన రెండింటిలో స్వల్ప వాటాలను కొనుగోలు చేసింది. దీని వెనుక ఆఫ్లైన్లోనూ విస్తరించాలన్నదే కంపెనీ లక్ష్యం. అమెజాన్ భారత ఈ కామర్స్ పోర్టల్‌లో లభించే ఎన్నో రకాల ఉత్పత్తులు ఫ్యూచర్ రిటైల్, మోర్, షాపర్స్ స్టాప్ దుకాణాల్లోనూ విక్రయానికి ఉంచాలన్నది అమెజాన్ వ్యూహమని పరిశ్రమకు చెందిన వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా అమెజాన్ తన ప్రైవేటు లేబుల్ (తన సొంత బ్రాండ్లకు చెందినవి) ఉత్పత్తులను విక్రయానికి ఉంచాలనుకుంటోంది. ఆ తర్వాత అమెజాన్ ఈ కామర్స్‌లో అధికంగా అమ్ముడయ్యే అన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్మకాలు సాగించే అమెజాన్ బేసిక్స్ (అమెజాన్ ప్రైవేటు లేబుల్) ఉత్పత్తులను ఫ్యూచర్ రిటైల్, మోర్, షాపర్స్‌స్టాప్‌కు చెందిన మొత్తం 2,000కు పైగా దుకాణాల్లో విక్రయానికి పెట్టనుంది. విస్తృతమైన ఉత్పత్తులు... అమెజాన్ బేసిక్స్ పేరుతో ఏసీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, హెచ్డీఎంఐ కేబుళ్లు, బ్యాటరీలు, బెడ్షీట్లు, టవళ్లు, డిన్నర్ ప్లేట్లు, కట్లరీ, గొడుగులు, బ్యాగులు ఇతర ఉత్పత్తులను అమెజాన్ సంస్థ విక్రయిస్తోంది. ప్రౌల్, జస్ట్ ఎఫ్ అనే రెండు బ్రాండ్ల పేరిట వస్త్రాలను షాపర్స్ స్టాప్ దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తోంది. ఇకపై దీన్నే మరింత విస్తృతం చేయనుంది. అంతేకాదు, కిరాణా, ఫ్యాషన్ ప్రైవేటు బ్రాండ్లను కూడా అమెజాన్ తీసుకురానుంది. అయితే, ఈ ప్రణాళికలపై అమెజాన్ కానీ, ఈ సంస్థకు వాటాలున్న రిటైల్ సంస్థలు కానీ స్పందించలేదు. అయితే, ఓ రిటైల్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాత్రం... అమెజాన్‌తో జరిగిన షేరు కొనుగోళ్ల ఒప్పందంలో ఆ సంస్థ ఉత్పత్తుల విక్రయాలను చేపట్టాలన్న నిబంధన లేదని స్పష్టం చేశారు. అయితే, అమెజాన్ ఆన్లైన్ ఉత్పత్తులను విక్రయించే అవకాశం అయితే ఉందని సంకేతాన్నిచ్చారు. అమెజాన్ పే సేవలు... అమెజాన్‌తో ఒప్పందంలో భాగంగా... షాపర్స్‌స్టాప్, మోర్, ఫ్యూచర్ గ్రూపు ఇప్పటికే తమ ఉత్పత్తులను అమెజాన్ ఈ కామర్స్ పోర్టల్‌తోపాటు హైపర్ లోకల్ ప్లాట్‌ఫామ్ ‘ప్రైమ్‌నౌ’పై విక్రయాలు చేస్తున్నాయి. అలాగే, అమెజాన్ పే చెల్లింపుల సేవలను మోర్, షాపర్స్ స్టాప్ దుకాణాల్లో అనుమతిస్తున్నాయి. త్వరలో బిగ్‌బజార్, ఈజీడే దుకాణాల్లోనూ అమెజాన్ పే సేవలు ఆరంభం కానున్నాయి. తన ఉత్పత్తులను విక్రయానికి ఏ విధంగా స్టోర్లను వినయోగించుకోవచ్చన్న దానిపై వాటి అభిప్రాయాలను అమేజాన్ కోరినట్టు ఈ చర్చల్లో భాగం పంచుకుంటున్న ఓ ఉద్యోగి తెలిపారు. ఆఫ్‌లైన్ స్టోర్లలో అమెజాన్ తన ఉత్పత్తులను ఆకర్షణీయమైన ధరలకు విక్రయించే వ్యూహంతో ఉందని సంకేతమిచ్చారు. అంటే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించే ధరలనే ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఉండేలా చూడనున్నట్టు చెప్పారు. అమెజాన్ పెద్ద ఎత్తున స్థానం కోసం చూస్తోందని, దీంతో ప్రస్తుతానికి అయితే ఈ ఉత్పత్తులపై మార్జిన్ చాలా స్వల్పంగానే ఉంటోందని తెలిపారు. వ్యూహాత్మక పెట్టుబడులు గత నెలలోనే ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటా కొనుగోలుకు అమెజాన్ ఒప్పందం చేసుకున్న విషయం గమనార్హం. ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్ కూపన్స్‌కు వాటాలున్నాయి. ఇది ఫ్యూచర్ గ్రూపు ప్రమోటర్లకు చెందిన సంస్థ. ఫ్యూచర్ గ్రూపు బిగ్‌బజార్, హెరిటేజ్ తదితర బ్రాండ్లతో 1,400కుపైగా రిటైల్ దుకాణాలను నిర్వహిస్తోంది. అలాగే, ఏడాది క్రితం మోర్ రిటైల్‌ను అమెజాన్ కొనుగోలు చేసింది. సమారా క్యాపిటల్‌తో కలసి మోర్లో మెజారిటీ వాటాలను సొంతం చేసుకుంది. మోర్‌కు దేశవ్యాప్తంగా 620 స్టోర్లు ఉన్నాయి. 2017లో షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాలను కూడా కొనుగోలు చేసింది. షాపర్స్ స్టాప్‌కు 83 స్టోర్లు ఉన్నాయి. ఆన్లైన్ నుంచి ఆఫ్‌లైన్ వరకు అన్ని చోట్లా ఉత్పత్తులను విక్రయించడమే దేశంలో బడా రిటైల్ సంస్థలకు భవిష్యత్తు రిటైల్ వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా పెద్ద ఎత్తున వినియోగదారులను చేరుకోవచ్చని భావిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో భారీగా విస్తరించిన రిలయన్స్ రిటైల్ త్వరలో ఈ కామర్స్లోకీ అడుగుపెట్టే ప్రణాళికలతో ఉంది. దీంతో అమెజాన్ ముందుగానే ఈ విభాగంలో బలమైన స్థానం దిశగా అడుగులు వేస్తున్నట్టు ఈ పరిణామాలను చూస్తే తెలుస్తోంది. -
పేటీఎమ్ మాల్లో ఈబే చేతికి 5.5% వాటా
న్యూఢిల్లీ: భారత ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్, పేటీఎమ్ మాల్లో 5.5 శాతం వాటాను అమెరికా ఈ–టైలర్ ఈబే కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. ఈ డీల్‌లో భాగంగా పేటీఎమ్ మాల్లో ఒక స్టోర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఈబే ప్రెసిడెంట్, సీఈఓ డెవిన్ వెన్ చెప్పారు. భారత ఈ కామర్స్ రంగంలో ఈబేకు ఇది మూడో పెట్టుబడి. గతంలో స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈబే పెట్టుబడులు పెట్టింది. -
మన డేటా మన దగ్గరే ఉండాలి..
న్యూఢిల్లీ: దేశీ యూజర్ల డేటా... మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాలని, ఇతర దేశాల్లో దీన్ని భద్రపర్చడం శ్రేయస్కరం కాదని ఈ–కామర్స్ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ–కామర్స్‌లో విదేశీ పత్య్రక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్‌తో సోమవారం సమావేశమైన వివిధ డిజిటల్ కామర్స్ కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ దేశీ వినియోగదారుల డేటాను దేశ ప్రయోజనాలకు తోడ్పడేలా ఉపయోగించాలని తెలిపారు. మరోవైపు, దేశీ ఈకామర్స్ కంపెనీలకు, విదేశీ ఈ కామర్స్ సంస్థలకు నిబంధనలు వేర్వేరుగా ఉండటం వల్ల కంపెనీలు సమాన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాయని మరో డిజిటల్ కామర్స్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. విదేశీ సంస్థల నుంచి దేశీ కంపెనీలకు పొంచి ఉన్న ముప్పు, అందరికీ సమాన అవకాశాల కల్పన, వివక్షపూరిత విధానాలు మొదలైన అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. తదుపరి మరింత వివరాలేమైనా ఇవ్వదల్చుకుంటే వచ్చే వారం తెలియజేయాలంటూ మంత్రి ఈ–కామర్స్ సంస్థల వర్గాలకు సూచించారు. జాతీయ ఈ–కామర్స్ విధానాన్ని ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలతో మంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
గూగుల్ గ్రేట్ షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా నిర్వహించే గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) వచ్చే నెల 10-12 తేదీల్లో జరగనున్నది. ఈ ఆన్లైన్ షాపింగ్ పెస్టివల్కు ప్రాధాన్యత భాగస్వామిగా ఆదిత్య బిర్లా మనీ మైయూనివర్శ్ వ్యవహరిస్తుంది. విదేశాల్లో సైబర్ మండే పేరుతో ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని, దీనికి భారత వెర్షన్‌గా జీఓఎస్ఎఫ్ను నిర్వహిస్తున్నామని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ రాజన్ ఆనందన్ పేర్కొన్నారు. ఈ 72 గంటల షాపింగ్ ఫెస్టివల్లో 450కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయని వివరించింది. రూ.299 స్పెషల్ సెక్షన్‌ను అందిస్తున్నామని, దీంట్లో భారీ డిస్కౌంట్లకు వస్తువులను అందిస్తామని, రవాణా చార్జీలు ఉచితమని, వస్తువు అందిన తర్వాతనే నగదు చెల్లించే ఫీచర్ ఉందని వివరించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకూ ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తున్నామని, ఈ పోటీలో గెలుపొందిన వారు 14 నిమిషాల పాటు ఉచితంగా (రూ.2.5 లక్షల విలువైనవి) షాపింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.