ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయాక మన దేశంలో ఈ కామర్స్ రంగం ఆకాశమే హద్దుగా వృద్ధి చెందుతోంది. ఇక కరోనాతో ఫిజికల్ డిస్టెన్సింగ్ వంటివి జన జీవితంలో భాగమయ్యాక డిజిటల్ సర్వీసెస్‌కి గిరాకీ పెరిగింది. దీంతో అనేక కంపెనీలు ఈ కామర్స్‌లోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరంగా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పాలు, కూరగాయలు మొదలు ఉప్పు, పప్పు, సోపు, షాంపూ వరకు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ రంగంలో ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జియోమార్ట్ వంటి ప్రముఖ సంస్థలు గ్రోసరీస్ డోర్ డెలివరీ సర్వీస్‌లు అందిస్తున్నాయి. వీటికి పోటీగా అనేక స్టార్టప్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ, గురగ్రామ్ ప్రాంతాల్లో బ్లింకిట్, జెప్టో వంటి ఈ కామర్స్ సైట్స్ ప్రారంభమయ్యాయి. మార్కెట్‌లో పాగా వేసేందుకు పోటీ కంపెనీల కంటే భిన్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
పది నిమిషాల్లోనే
సబ్బు, సర్ఫ్, పాలు, కాఫీ ఏదైనా సరే ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మీకు హోం డెలివరీ చేస్తామంటూ బ్లింకిట్, జెప్టోలు ప్రకటించాయి. ఆర్డర్ చేసిన క్షణం నుంచి పది నిమిషాలు ముగిసేలోగా నిజంగానే కష్టమర్లకు ఆర్డర్లను చేరవేస్తున్నాయి కూడా. ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో కాలంలో పోటీ పడి పని చేసే టెకీలు ఈ సర్వీసుల పట్ల ఆకర్షితులు అవుతున్నాయి. యూరప్, అమెరికా లాంటి దేశాలకే ఈ స్పీడ్ డెలివరీ సర్వీస్ సాధ్యమని అనుకున్నాం, కానీ మన దగ్గర కూడా టెన్ మినిట్స్ డెలివరీ వచ్చిందంటూ ఈ స్పీడ్‌ను స్వాగతిస్తున్నారు.
రద్దు చేయండి
మరోవైపు పది నిమిషాల్లో డెలివరీ సర్వీసు తమ ప్రాణాల మీదకు వచ్చిందంటున్నారు డెలివరీ బాయ్స్. పేరు చెప్పడానికి డెలివరీ బాయ్స్ తాము పడుతున్న ఇబ్బందులను రాయిటర్స్ దృష్టికి తీసుకెళ్లారు. తద్వారా ఈ అంశం జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. గుంతలమయంగా ఉండే రోడ్లు, ఇరుకు గల్లీలు, తరచుగా జరిగే ర్యాలీలు, ట్రాఫిక్ కష్టాలు వంటి స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పది నిమిషాల డెలివరీ సర్వీసును రద్దు చేయాలని కోరుతున్నారు.
రేసింగ్‌లా ఉంది
డెలివరీ బాయ్స్ చెబుతున్న వివరాల ప్రకారం.. ఆర్డర్ బుక్ చేసిన తర్వాత సదరు వస్తువును ప్యాక్ చేసుకుని డాక్యుమెంట్ వర్క్ పూర్తి చేయడానికే రెండు నుంచి మూడు నిమిషాల సమయం పడుతుంది. అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరుకునేందుకు కేవలం 5 నుంచి 7 నిమిషాల సమయమే మిగిలి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో డెలివరీ అందించేందుకు ఎంతో స్పీడ్‌గా డ్రైవ్ చేయాల్సి వస్తుందంటున్నారు. తాము రేసింగ్‌లో పాల్గొంటున్నట్టుగా బైకులు నడుపుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదంలో పడ్డారని, అదృష్టవశాత్తు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెబుతున్నారు.
లేటయినా పర్వాలేదు
డెలివరీ బాయ్స్ ఆందోళన ఇలా ఉంటే ఈ కామర్స్ ప్రతినిధుల వాదన మరోలా ఉంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు పది నిమిషాల డెలివరీ సర్వీసును అందిస్తున్నాం. ఈ సర్వీస్‌కి కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. కచ్చితంగా పది నిమిషాల్లోనే వెళ్లాలని అనే నిబంధన ఏమీ డెలివరీ బాయ్స్‌కి పెట్టడం లేదు. ఆలస్యమయితే ఎలాంటి ఫైన్లు విధించడం లేదు. కస్టమర్లను త్వరగా సేవలు అందివ్వడమే తమ లక్ష్యమని చెబుతున్నాయి.
వాస్తవంలో అలా లేదు
పది నిమిషాల్లో డెలివరీ చేయకపోయినా పర్వాలేదంటూ కంపెనీ ప్రతినిధులు చెబుతున్న మాటలు అబద్దం అంటున్నారు డెలివరీ బాయ్స్. సకాలంలో ఆర్డర్‌ని అందివ్వకపోతే చాలా మందికి రోజువారి జీతంలో రూ.300ల వరకు కోత విధిస్తున్నారని, తమని నొప్పించేలా స్టోర్ మేనేజర్లు మాట్లాడుతున్నారని డెలివరీ బాయ్స్ అంటున్నారు.
మొదలైన చర్చ
ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా ఇండియా ఉంది. ఇక్కడ ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. సగటున ఏడాదికి లక్షన్నర మంది చనిపోతున్నారు. మరోవైపు ఇండియాలో ఆన్‌లైన్ గ్రాసరీ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. దీంతో బడా కార్పోరేట్ కంపెనీలకు తోడు స్టార్టప్‌లు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ తరుణంలో డెలివరీ బాయ్స్‌లు పడుతున్న ఇబ్బందులపై చర్చ మొదలైంది. రోడ్ సెఫ్టీ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆఫర్లు ప్రకటించాలని డెలివరీ బాయ్స్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment