అమెజాన్
బెంగళూరు : దేశీయ ఆన్‌లైన్ ఫ్యాషన్ షాపింగ్ వేదికగా ఉన్న మింత్రాను ఫ్లిప్‌కార్ట్ దక్కించుకున్న అనంతరం, అమెజాన్ ఇండియా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. సొంతంగా బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల బ్రాండును లాంచ్ చేయాలని సన్నద్ధమవుతోంది. ఆధిపత్య స్థానంలో ఉన్న చిన్న స్టార్టప్‌లను వెనక్కి నెట్టేస్తూ... వేగవంతమైన ఈ కాస్మోటిక్స్ మార్కెట్‌లో ఈ రెండు డిజిటల్ రిటైలర్లు పోటీ పడబోతున్నాయి. కాంట్రాక్ట్ మానుఫాక్ట్ర్చర్స్‌తో అమెజాన్ ఇండియా చర్చలు జరుపుతుందని, స్కిన్ కేర్, మేకప్‌లో కొన్ని కేటగిరీల్లో ప్రైవేట్ లేబుల్స్‌ను లాంచ్ చేస్తుందని ఈ విషయం తెలిసిన వర్గాలు చెప్పాయి. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ రెండూ ఎక్కువ మార్జిన్లు అందించే కాస్మోటిక్స్ కేటగిరీపై దృష్టిసారించాయని తెలిపాయి.
అయితే సొంత బ్రాండులను ప్రవేశపెట్టేముందు ఈ కేటగిరీల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెజాన్ ఇండియా ఇప్పటికే 19వేల బ్రాండ్స్‌లో 20 లక్షల బ్యూటీ ప్రొడక్ట్‌లను రిటైల్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా 100కు పైగా బ్రాండుల్లో బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా రిటైల్ చేయడం కంటే అంతర్జాతీయ బ్రాండులతో కలిసి కొత్తగా బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండులను లాంచ్ చేయాలని కూడా మింత్రా చూస్తోంది. అంతర్జాతీయ బ్రాండులతో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తున్నట్టు మింత్రా, జబాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనంత్ నారాయణన్ తెలిపారు. 2020 వరకు మొత్తం రెవెన్యూలో బ్యూటీ సెగ్మెంట్ సహకారం 8 శాతం ఉంచుకోవాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 1 శాతంగా మాత్రమే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment