50వేల ఉద్యోగాలకు అమెజాన్ రెడీ
50వేల ఉద్యోగాలకు అమెజాన్ రెడీ
Published Thu, Sep 7 2017 6:10 PM | Last Updated on Fri, May 25 2018 7:16 PM
సీటల్: ప్రముఖ బహుళ జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ 50వేల ఉద్యోగాలకు రెడీ అవుతోంది. తన రెండో ప్రధాన కార్యలయాన్ని త్వరలోనే ఏర్పాటుచేయబోతుంది. 50వేల ఉద్యోగాలతో ఉత్తర అమెరికాలో రెండో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు అమెజాన్ గురువారం ప్రకటించింది. ఈ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటుచేయడానికి, నిర్వహించడానికి అయ్యే ఖర్చు దాదాపు 5 బిలియన్ డాలర్లని కంపెనీ వ్యవస్థాపకుడు, బిలీనియర్ జెఫ్ బెజోస్ చెప్పారు. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. ఈ ఆఫీసు కోసం కొత్త టీమ్‌లను, ఎగ్జిక్యూటివ్‌లను కూడా నియమించుకోవాలని చూస్తున్నట్టు పేర్కొంది. వారి టీమ్‌లను ఇక్కడకు కేటాయించాలో లేదో ప్రస్తుతం కంపెనీలో ఉన్న సీనియర్ లీడర్లు నిర్ణయిస్తారని చెప్పింది.
ప్రస్తుత ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు అక్కడే పనిచేసేందుకు వీలుందని లేదా వారు కావాలంటే కొత్త ప్రధాన కార్యాలయానికి కూడా తరలివెళ్లవచ్చని కంపెనీ వివరించింది. ఈ కార్యాలయంలో నియమించుకోబోయే 50వేల ఉద్యోగుల్లో ఎక్కువ వేతనాలే ఉంటాయని తెలుస్తోంది. తాము రెండో వసతి గృహాన్ని వెతకడంలో ఎంతో ఉత్సాహంతో ఉన్నామని కంపెనీ ప్రకటించింది. సీటల్ హెడ్‌క్వార్టర్స్ లాగానే దీన్ని కూడా ఏర్పాటుచేయబోతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా 3,82,000 మంది ఉద్యోగులున్నారు. వచ్చే 18 నెలల్లో లక్ష ఉద్యోగాలను అమెరికా సృష్టించబోతున్నట్టు అమెజాన్ చెప్పింది. 2016 కల్లా దేశీయంగా వర్క్‌ఫోర్స్‌ను 1,80,000కు పెంచనున్నట్టు పేర్కొంది.
Advertisement