
మరో మూడు ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు
అమెజాన్ డెరైక్టర్ నూర్ పటేల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఏడాది చివరి నాటికి మరో మూడు ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను (ఎఫ్ సీ) భారత్‌లో ఏర్పాటు చేస్తోంది. దీంతో ఎఫ్‌సీల సంఖ్య 27కు పెరగనుంది. ప్రస్తుతం తెలంగాణతోసహా 10 రాష్ట్రాల్లో ఎఫ్‌సీలను కంపెనీ నిర్వహిస్తోంది. ఉత్పత్తులను నిల్వ, డెలివరీని ఈ కేంద్రాల నుంచి చేపడుతోంది. కొత్త సెంటర్లతో కలిపి నిల్వ సామర్థ్యం 7.5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరుతుందని అమెజాన్ కేటగిరీ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ నూర్ పటేల్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. అమెజాన్ పాంట్రీ సర్వీసులను దేశంలో తొలుతగా హైదరాబాద్‌లో ప్రారంభించామన్నారు.
నిత్యావసర సరుకులను ఇక నుంచి కస్టమర్లు ఆర్డరు ఇవ్వొచ్చని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 65 శాతం ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. 1.2 లక్షల మంది విక్రేతలు 8 కోట్లకుపైగా ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్ముతున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లో 5 వేల మంది విక్రేతలు ఉన్నారు. 29 వేల మంది సెల్లర్లు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.