
వసూలు కాని పన్ను మొత్తం రూ.7 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వసూలు కాని పన్ను మొత్తాలు 2015 మార్చి నాటికి రూ. 7 లక్షల కోట్లకు పెరిగాయి. 2014 ఇదే నెల నాటికి ఈ మొత్తం రూ.5.75 లక్షల కోట్లు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. పన్ను బకాయిదారుల స్థిర, చర ఆస్తుల జప్తు, అమ్మకం, సంబంధింత ఆస్తుల నిర్వహణకు రిసీవర్ నియామకం, జైలుశిక్ష వంటి ఎన్నో మార్గాల ద్వారా చట్ట ప్రకారం వసూళ్లకు అవకాశం ఉన్నప్పటికీ ఈ పరిమాణం పెరుగుతున్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. స్వాధీనానికి తగిన ఆస్తులు లేకపోవడం, బకాయిదారుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోవడం, పలు కేసులు న్యాయ, అధికార పరిధుల్లో పెండింగులో ఉండడం వంటి అంశాలు పన్ను డిమాండ్‌లు నెరవేరకపోవడానికి కారణాలని తెలిపింది. 2013-14తో పోల్చితే 2014-15లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 9 శాతం మేర (రూ.57,196 కోట్లు) పెరిగినట్లు పేర్కొంది. అయితే స్థూలంగా పన్ను వసూళ్లలో వీటి వాటా మాత్రం 56.1 శాతం నుంచి 55.9 శాతానికి తగ్గినట్లు వివరించింది.