పలు కీలక కంపెనీలు ఈ వారంలో క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడించనున్నాయని, ఈ కంపెనీల ఫలితాల ప్రభావం ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ ఫలితాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. అక్టోబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు గురువారం (ఈ నెల 25న) ముగియనున్నందున సూచీలు ఒడిదుడుకులకు గురవుతాయని విశ్లేషకులంటున్నారు. ఫలితాల కారణంగా షేర్ వారీ కదలికలు కీలకమని వారంటున్నారు.
కీలక కంపెనీల క్యూ2 ఫలితాలు..
ఈ వారంలో దాదాపు 300కు పైగా కంపెనీలు, వీటిల్లో 15 నిఫ్టీ కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, భారీగా నిరాశ పరచలేదని, అందుకే మార్కెట్‌కు దిగువ స్థాయిల్లో కూడా మద్దతు లభిస్తోందని నిపుణులంటున్నారు.
ఇక ఈ వారంలో వెలువడే కంపెనీల ఫలితాలు ఆశాజనకంగానే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంక్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, టీవీఎస్ మోటార్, బయోకాన్, భెల్ తదితర కంపెనీలు ఫలితాలను వెల్లడిస్తాయి.
పరిమిత శ్రేణిలోనే...
ఈ వారం మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ అంచనా వేస్తున్నారు. లిక్విడిటీ సమస్యలు, ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు, రానున్న ఎన్నికలపై ఆందోళనలు.. స్టాక్ మార్కెట్‌పై భారాన్ని కొనసాగించనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే ఈ అంశాల్లో చాలా భాగాన్ని మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా బాండ్ల రాబడుల్లో నిలకడ నెలకొనడం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు సంబంధించిన పరిణామాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వివరించారు. సాంకేతికంగా చూస్తే, నిఫ్టీ బలహీనంగానే ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని వ్యాఖ్యానించారు. నాన్ బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లిక్విడిటీ సమస్యలపై ఈ వారం కూడా మార్కెట్ దృష్టి పెడుతుందని డెల్టా గ్లోబల్ పార్ట్‌నర్స్ సంస్థ వ్యవస్థాపకుడు దేవేంద్ర నేగీ పేర్కొన్నారు.
ఇక అంతర్జాతీయంగా చూస్తే, ఈ నెల 23(మంగళవారం) జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. బుధవారం(ఈ నెల24న) అమెరికాలో సెప్టెంబర్ ఇళ్ల అమ్మకాల గణాంకాలు వెలువడతాయి. ఈ గురువారం (ఈ నెల 25న)యూరోపియన్ కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. రేట్ల విషయంలో యథాతథ స్థితి ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఈ నెల 26న(శుక్రవారం) అమెరికా క్యూ3 జీడీపీ గణాంకాలు వస్తాయి. ఈ వారంలో ఇటలీ బడ్జెట్ పరిణామాలు కూడా కీలకం కానున్నాయి.
3 వారాల్లో.. రూ.32,000 కోట్లు వెనక్కి...
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెలలో మొదటి మూడు వారాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.32,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికాలో బాండ్ల రాబడులు ఎగియడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెల 19వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.19,810 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.12,167 కోట్ల చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
కాగా గత నెల మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.21,000 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాదిలో 2 నెలలు మినహా విదేశీ నిధులు తరలిపోతూనే ఉన్నాయి. ఈ నెలలో ఈ జోరు మరింతగా పెరగడంతో స్టాక్ మార్కెట్ మరింతగా కుదేలవుతోందని నిపుణులంటున్నారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.33,000 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.60,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
ఈ వారం కీలక క్యూ2 ఫలితాలు
22–సోమవారం
హిందుస్తాన్ జింక్, కెన్ ఫిన్ హోమ్స్, ఏషియన్ పెయింట్స్, అలెంబిక్ ఫార్మా, ఒబెరాయ్ రియల్టీ
23–మంగళ వారం
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఆర్‌బీఎల్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, అంబుజా సిమెంట్స్
24–బుధవారం
బజాజ్ ఆటో, విప్రో, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఇండిగో, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్
25–గురువారం
భారతీ ఎయిర్‌టెల్, మారుతీసుజుకీ, యస్‌బ్యాంక్ ,ఓబీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బయోకాన్
26–శుక్రవారం
ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యూపీఎల్
Comments
Please login to add a commentAdd a comment