ఆంధ్రాబ్యాంక్ లో పెరిగిన ఎల్ఐసీ వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ... ఆంధ్రాబ్యాంక్‌లో తన వాటాను పెంచుకుంది. తాజాగా రూ.136.48 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండటంతో షేరు రూ.47.30 చొప్పున 2.88 కోట్ల షేర్లను ఎల్‌ఐసీకి కేటాయించడానికి శుక్రవారం సమావేశమైన ఆంధ్రా బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు ఆమోదం తెలిపారు. దీనికి మార్చి 21న జరిగే అత్యవసర సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రా బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 4.99 కోట్ల షేర్లతో 7.66 శాతం వాటాను కలిగి ఉంది. దీంతో బ్యాంకులో ఎల్‌ఐసీ షేర్ల సంఖ్య 7.87 కోట్లు దాటింది. దీన్లో కేంద్ర ప్రభుత్వానికి 63.97% వాటా ఉండగా ఆ తరవాత అత్యధిక వాటా ఉన్నది ఎల్‌ఐసీకే. ఈ మధ్యనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి టైర్-1 మూలధనం కింద రూ. 800 కోట్లు సమీకరించింది. శుక్రవారం బీఎస్‌ఈలో ఆంధ్రా బ్యాంక్ షేరు స్థిరంగా రూ. 46.85 వద్ద ముగిసింది.