ఈ ఏడాది లక్ష్యం...రూ.1,000 కోట్ల లాభం
- త్వరలో రూ. 700 కోట్ల క్విప్ ఇష్యూ
- విదేశీ విస్తరణపై దృష్టి...
- ఆంధ్రాబ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవో ఎస్.కె. కల్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 1,000 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయాలని ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గడచిన ఏడాది నికర లాభం 47 శాతం పెరిగి రూ. 638 కోట్లకు చేరిందని, ఈ ఏడాది కూడా ఇదే విధమైన వృద్ధిని నమోదు చేయడం ద్వారా నికర లాభం నాలుగంకెల స్థాయిని దాటించగలమన్న ధీమాను బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవో ఎస్.కె.కల్రా వ్యక్తం చేశారు. తొలుత ఈ ఏడాది రూ. 800 కోట్ల నికరలాభాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ ఈ ఏడాదే రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించాలన్నది ఒక కల అని అన్నారు.
ఆంధ్రాబ్యాంక్ 2,600వ శాఖ, 3,000 ఏటీఎంలను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ ఇదే విధమైన వృద్ధిని నమోదు చేస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా అందుకోగలమన్నారు. తొలి త్రైమాసికంలో రూ. 203 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశామని, ఈ రెండో త్రైమాసికంలోనూ ఇదే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
విదేశీ విస్తరణపైనా దృష్టి...
దేశవ్యాప్త విస్తరణపై ఆంధ్రాబ్యాంక్ దృష్టిసారించింది. గడచిన మూడేళ్లలో 798 శాఖలను ప్రారంభించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 101 శాఖలను ప్రారంభించినట్లు తెలిపారు. శుక్రవారం ప్రారంభించిన 10 శాఖలతో కలసి మొత్తం శాఖల సంఖ్య 2,607కు చేరింది. విదేశీ విస్తరణపైనా ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇంత వరకు అధికారికంగా ఆర్‌బీఐని సంప్రదించకపోయినా, దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్‌కు దుబాయ్, న్యూజెర్సీలో రిప్రజెంటేటివ్ ఆఫీసులున్నాయి. ఆర్‌బీఐ నుంచి అనుమతులొస్తే వీటిని పూర్తిస్థాయి శాఖలుగా మార్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
త్వరలో క్విప్ ఇష్యూ
వచ్చే త్రైమాసికంలో క్విప్ ఇష్యూ ద్వారా రూ. 700 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మూల ధన అవసరాల కోసం రూ. 3,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించగా, ఇందులో కేంద్రం రూ. 378 కోట్లు సమకూర్చిందని, ప్రస్తుతం రూ. 500 కోట్ల టైర్2 బాండ్ ఇష్యూ నడుస్తోందన్నారు. మిగిలిన రూ. 1,300 కోట్లు అవసరాన్ని బట్టి టైర్-2 బాండ్ల రూపంలో సమీకరించనున్నట్లు తెలిపారు.
కొత్త కాసా పథకాలు
ఆంధ్రాబ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలను(కాసా) పెంచుకోవడంపై దృష్టిసారించింది. ఇందుకోసం ఏబీ ఎమరాల్డ్ ప్లస్ పేరుతో ఆధునీకరించిన కరెంట్ అకౌంట్ ఖాతాను, ఏబీ సూపర్ శాలరీ సేవింగ్ డిపాజిట్ అకౌంట్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం మొత్తం డిపాజిట్లలో కాసా వాటా 27.35 శాతంగా ఉందని, ఈ ఏడాది చివరికి ఇది 30 శాతం దగ్గరికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.