ఆంధ్రా బ్యాంక్ లాభం రెట్టింపు
⇒ రూ. 185 కోట్లకు పెరుగుదల
⇒ తగ్గిన మొండిబకాయిలు...
⇒ బ్యాంక్ సీఎండీ రాజేంద్రన్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీ ఆదాయం పెరగడం, నిరర్థక ఆస్తులు తగ్గడం తదితర అంశాల ఊతంతో 2014-15 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్ నికర లాభం 110 శాతం ఎగిసింది. 2013-14 క్యూ4లో రూ. 88 కోట్లు కాగా తాజాగా రూ. 185 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 4,058 కోట్ల నుంచి రూ. 4,699 కోట్లకు పెరిగింది.
నికర వడ్డీ ఆదాయం 44 శాతం పెరిగి రూ. 1,371 కోట్లుగాను నమోదైంది. ఒకవైపు డిపాజిట్ల వ్యయం తగ్గడం, మరోవైపు ఇచ్చిన రుణాలపై వడ్డీ ఆదాయాలు పెరగడం మెరుగైన పనితీరుకు దోహదపడ్డాయని సోమవారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.65% నుంచి 3.48%కి పెరిగాయని పేర్కొన్నారు. అలాగే, నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏ) క్రితం త్రైమాసికంతో పోలిస్తే 3.70% నుంచి 2.93 శాతానికి తగ్గాయని రాజేంద్రన్ వివరించారు. రుణాల పునర్‌వ్యవస్థీకరణకు(సీడీఆర్) సంబంధించి ఎక్కువగా ఇన్‌ఫ్రా రంగ సంస్థల అకౌంట్లు ఉన్నాయని ఆయన చెప్పారు.
రూ. 3,000 కోట్ల నిధుల సమీకరణ ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మొదటి, ద్వితీయ శ్రేణి క్యాపిటల్ కింద బాండ్ల జారీ ద్వారా సుమారు రూ. 3,000 కోట్లు సమీకరించనున్నట్లు రాజేంద్రన్ చెప్పారు. జాతీయ స్థాయి లో కార్యకలాపాలను మరిం తగా విస్తరిస్తున్నామన్నారు. ప్రస్తుతం 2,507 శాఖలు ఉన్నాయని, మూడేళ్లలో ఈ సంఖ్యను 3,600కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు.
2015-16 తొలి త్రైమాసికంలోనే సుమారు 200 శాఖలను ప్రారంభించనున్నట్లు రాజేంద్రన్ తెలి పారు. తెలంగాణలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. చిన్న సంస్థలకు సులభతరంగా రుణాలిచ్చేలా త్వరలో కరీంనగర్‌లో ఎస్‌ఎంఈ ఎక్స్‌ప్రెస్‌ను, అలాగే రిటైల్ రుణాలకు సంబంధించి తిరుపతిలో లోన్ ఎక్స్‌ప్రెస్ సెంటర్‌ను ప్రారంభించే ప్రతిపాదన ఉందన్నారు.
రుణమాఫీలో తెలంగాణ గుడ్..
రుణ మాఫీ చెల్లింపుల్లో తెలంగాణ రికార్డు బాగుందని రాజేంద్రన్ తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో (ఏపీ) ఇంకా హార్టికల్చర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు సంబంధించి చెల్లింపులు రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇప్పటిదాకా రుణ మాఫీ విషయంలో రెండు విడతల చెల్లింపులు లభించాయని, కానీ హార్టికల్చర్, స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కి సంబంధించి ఎలాంటి చెల్లింపులు రాలేదన్నారు. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర బీఎస్‌ఈలో 1.5% పెరిగి రూ.76 వద్ద స్థిరపడింది.