ఆంధ్రా బ్యాంక్ లాభం 65% అప్
• క్యూ3లో రూ. 57 కోట్లు
• 6.98 శాతానికి నికర ఎన్‌పీఏలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు గణనీయంగా పెరిగినప్పటికీ.. అధిక ట్రెజరీ ఆదాయాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ నికర లాభం 65% వృద్ధితో రూ. 56.70 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ 34.46 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. తాజాగా ఆదాయం రూ. 4,801 కోట్ల నుంచి రూ. 5,012 కోట్లకు పెరిగినట్లు ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది.
సమీక్షాకాలంలో ట్రెజరీ విభాగ ఆదాయం రూ. 1,013 కోట్ల నుంచి రూ. 1,312 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 7% నుంచి 11.88%కి పెరగ్గా.. నికర ఎన్‌పీఏలు 3.89% నుంచి 6.98%కి ఎగిశాయి. విలువపరంగా చూస్తే డిసెంబర్ ఆఖరుకి జీఎన్‌పీఏలు రూ. 9,520.92 కోట్ల నుంచి రూ. 16,888.34 కోట్లకు పెరిగాయి. అటు నికర ఎన్‌పీఏలు రూ. 5,102.81 కోట్ల నుంచి రూ. 9,382.38 కోట్లకు ఎగిశాయి. అయితే, మొండి బకాయిల కోసం కేటాయింపులు రూ. 905.56 కోట్ల నుంచి రూ. 828.71 కోట్లకు తగ్గాయి.
గురువారం బీఎస్‌ఈలో ఆంధ్రా బ్యాంక్ షేరు 1.23 శాతం పెరిగి రూ. 57.80 వద్ద ముగిసింది.