అంచనాల్ని మించిన టీసీఎస్‌.. | TCS Q3 net profit up 11 p.c. to Rs. 6778 crore | Sakshi
Sakshi News home page

అంచనాల్ని మించిన టీసీఎస్‌..

Published Fri, Jan 13 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

అంచనాల్ని మించిన టీసీఎస్‌..

అంచనాల్ని మించిన టీసీఎస్‌..

క్యూ3లో 11% ఎగిసిన నికర లాభం
మొత్తం ఆదాయంలో 9% వృద్ధి
ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి మహిళా ఉద్యోగులు  


ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాల్ని మించి వృద్ధి సాధించింది. క్యూ3లో నికర లాభం 10.9 శాతం ఎగిసి రూ. 6,778 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.6,110 కోట్లు. తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 8.7 శాతం వృద్ధితో రూ.27,364 కోట్ల నుంచి రూ. 29,735 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.9 శాతం, ఆదాయం 1.5 శాతం మేర పెరిగాయి. నిర్వహణ లాభం రూ. 7,733 కోట్లుగా నమోదైంది. షేరు ఒక్కింటికి రూ. 6.5 మేర డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు టీసీఎస్‌ తెలిపింది.

సాధారణంగా డిసెంబర్‌ త్రైమాసికంలో డిమాండ్‌ తక్కువని, అయినప్పటికీ పటిష్టమైన నిర్వహణ వ్యూహాలతో మెరుగైన పనితీరు కనపర్చగలిగామని టీసీఎస్‌ ఎండీ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. డిజిటల్, క్లౌడ్‌ తదితర విభాగాల్లో విశేషానుభవం ఇందుకు తోడ్పడిందన్నారు. ‘‘ఏటా 30 శాతం మేర వృద్ధి చెందుతున్న డిజిటల్‌ వ్యాపార విభాగాన్ని పటిష్టం చేసుకునేలా ఈ టెక్నాలజీలపై మరింత ఇన్వెస్ట్‌ చేస్తాం. కొత్త ఐపీ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు, ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి పెడతాం’’ అని ఆయన వివరించారు. ఓ వైపు మెరుగైన వృద్ధి సాధిస్తూనే ..మరోవైపు నిర్దేశించుకున్న స్థాయిలో లాభదాయకతను కూడా స్థిరంగా సాధించగలుగుతున్నామని టీసీఎస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాజేశ్‌ గోపీనాథన్‌ తెలిపారు.

విభాగాల వారీగా..: ఆదాయాల వృద్ధిలో ఎనర్జీ అండ్‌ యుటిలిటీస్‌ విభాగం కీలక పాత్ర పోషించింది. సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన 5.8 శాతం పెరిగింది. ఇక హైటెక్‌ 2.6 శాతం , బ్యాంకింగ్‌.. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. బీమా విభాగం 2.1 శాతం, తయారీ 2.1 శాతం, రిటైల్‌ 1.9 శాతం మేర వృద్ధి చెందాయి. ప్రాంతాల వారీగా చూస్తే లాటిన్‌ అమెరికా వ్యాపారం 12.5%, భారత మార్కెట్‌ 10.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఉత్తర అమెరికా 2.2 శాతం, బ్రిటన్‌ 1.7 శాతం పెరిగాయి.

రికార్డు స్థాయికి ఉద్యోగినుల సంఖ్య..
ఐటీ సేవల విభాగానికి సంబంధించి మొత్తం అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) 11.3 శాతానికి తగ్గినట్లు టీసీఎస్‌ తెలిపింది. క్యూ3లో స్థూలంగా 18,362 మంది, నికరంగా 6,978 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు టీసీఎస్‌ తెలిపింది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,78,497కి చేరింది. మరోవైపు, మహిళా ఉద్యోగుల సంఖ్య ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి 34.6 శాతానికి చేరినట్లు కంపెనీ పేర్కొంది.

వీసాల రిస్కులకు వ్యూహం..
అమెరికాలో హెచ్‌1–బీ వీసాల జారీని తగ్గించటం, వీసా ఫీజులు పెంచటం వంటి రిస్కులను ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలను రూపొందించుకుంటున్నట్లు చంద్రశేఖరన్‌ తెలిపారు. ‘‘ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఏడాది కిందటే ఊహించాం. 2016లో అమెరికా వీసా దరఖాస్తుల సంఖ్య 4,000కు తగ్గించుకున్నాం. 2015లో దరఖాస్తుల సంఖ్య 14,000గా ఉన్నా.. వాటిలో మూడో వంతుకే వీసాలు జారీ అయ్యాయి’’ అని వివరించారు. ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 0.8 శాతం పెరిగి రూ. 2,343 వద్ద ముగిసింది.  మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement