టీసీఎస్‌ బోణీ భేష్‌! | TCS Q2 results today: 5 things to watch out for | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ బోణీ భేష్‌!

Published Fri, Oct 12 2018 12:49 AM | Last Updated on Fri, Oct 12 2018 12:49 AM

TCS Q2 results today: 5 things to watch out for - Sakshi

ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్‌ అగ్రగామి టీసీఎస్‌ మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018–19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదా యం 20.7 శాతం వృద్ధితో రూ. 30,541 కోట్ల నుంచి రూ.36,854 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా డాలరుతో రూపాయి  విలువ భారీగా పడిపోవడం, డిజిటల్‌ వ్యాపారం మంచి జోరును ప్రదర్శించడం మెరుగైన లాభాలకు దోహదం చేశాయి. ఈ ఏడాది క్యూ2 మొత్తం ఆదాయంలో డిజిటల్‌ సేవల విభాగం వాటా 28 శాతానికి దూసుకెళ్లడం గమనార్హం. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కా లంలో డాలరుతో రూపాయి మారకం విలువ 5.87 శాతం క్షీణించి.. 72.49 స్థాయికి పడిపోయింది. 

సీక్వెన్షియల్‌గా చూస్తే... 
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో కంపెనీ నికర లాభం రూ. 7,360 కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన క్యూ2లో లాభం 7.6 శాతం పెరిగింది. ఇక క్యూ1లో రూ. 34,261 కోట్లతో పోలిస్తే క్యూ2 ఆదాయం 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. డాలర్ల రూపంలో కంపెనీ ఆదాయం సీక్వెన్షియల్‌గా 3.2 శాతం వృద్ధితో 5,215 మిలియన్‌ డాలర్లకు చేరింది. మార్కెట్‌ విశ్లేషకులు క్యూ2లో టీసీఎస్‌ రూ.8,065 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. అయితే లాభాల పరంగా అంచనాలు కొద్దిగా తప్పినప్పటికీ... ఎబిటా, డాలరు ఆదాయాల్లో మాత్రం టీసీఎస్‌ మెరుగైన
పనితీరును సాధించింది. 

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... 
►క్యూ2లో  స్థూల లాభం(ఎబిటా) 13.9% ఎగబాకి రూ.9,771 కోట్లుగా నమోదైంది. జీతాల పెంపులేవీ లేకపోవడం, రూపాయి క్షీణత కారణంగా నిర్వహణ మార్జిన్‌ 1.44%(సీక్వెన్షియల్‌గా) ఎగబాకి.. 26.5 శాతానికి చేరింది. 
► రంగాలవారీగా చూస్తే...  రిటైల్‌ విభాగం 15.6 శాతం ఆదాయం, బ్యాంకింగ్‌–ఫైనాన్షియల్‌ సేవల(బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగం  6.1 శాతం, లైఫ్‌ సైన్సెస్‌–హెల్త్‌కేర్‌ 14.7 శాతం, ఇంధనం–యుటిలిటీస్‌ 22.2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. 
►ప్రాంతాలవారీగా ఉత్తర అమెరికా నుంచి ఆదాయంలో 8.1 శాతం వృద్ధి నమోదైంది. యూరప్‌ 17.4 శాతం, ఆసియా పసిఫిక్‌ 12.5 శాతం చొప్పున ఆదాయ వృద్ధి నమోదుచేశాయి. 
►క్యూ2లో 100 మిలియన్‌ డాలర్లకు పైబడిన 4 కొత్త కాంట్రాక్టులను టీసీఎస్‌ దక్కించుకుంది. 20 మిలియన్‌ డాలర్లకు మించిన 11 కాంట్రాక్టులు, 10 మిలియన్‌ డాలర్లకు పైబడిన 10 కాంట్రాక్టులను జత చేసుకుంది. 
► కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్‌కు రికార్డు తేదీగా ఈ నెల 24ను ఖరారు చేసింది. 
►  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు ధర 3.1% నష్టంతో రూ.1,980 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత ఫలితాలను ప్రకటించింది.

జోరుగా నియామకాలు... 
వలసలు తగ్గుముఖం పట్టడంతో పాటు జూలై–సెప్టెంబర్‌ కాలంలో టీసీఎస్‌ నికరంగా 10,227 మంది ఉద్యోగులను నియమించుకుంది. గడిచిన క్వార్టర్లలో ఇవే అత్యధిక నికర నియామకాలు కూడా. దీంతో సెప్టెంబర్‌ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య (అనుబంధ సంస్థలతో కలిపి) 4,11,102కు చేరుకుంది. సిబ్బంది వలసల (అట్రిషన్‌) రేటు స్థిరంగా 10.9 శాతం ఉన్నట్లు టీసీఎస్‌ వెల్లడించింది. ఇది మొత్తం దేశీ ఐటీ పరిశ్రమలోనే అత్యంత మెరుగైనదిగా పేర్కొంది. కాగా, ప్రారంభ స్థాయి నిపుణుల నియామకం కోసం తాము నిర్వహిస్తున్న జాతీయ అర్హత పరీక్షలో 1,800 కళాశాలలు పాలుపంచుకున్నాయని... ఈ ప్రక్రియను ఇకముందూ కొనసాగిస్తామని టీసీఎస్‌ మానవవనరుల విభాగం గ్లోబల్‌ హెడ్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజోయ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ఈ ఏడాది 2 లక్షల మందికిపైగా అర్హత పరీక్షకు హాజరైనట్లు ఆయన చెప్పారు. గతేడాది క్యాంపస్‌ నియామకాల్లో 20,000 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ జూన్‌ క్వార్టర్‌ నుంచి వారికి కంపెనీలోకి తీసుకునే ప్రక్రియను మొదలుపెట్టామని.. వచ్చే క్వార్టర్లలోనూ ఇది కొనసాగుతుందని ముఖర్జీ చెప్పారు. 

ఇది చిరస్మరణీయమైన క్వార్టర్‌... 
‘క్యూ2లో పటిష్టమైన పనితీరును నమోదు చేశాం. ఇది కంపెనీకి చిరస్మరణీయమైన క్వార్టర్‌గా నిలుస్తుంది. మిగిలిన త్రైమాసికాల్లోనూ రెండంకెల వృద్ధిని కొనసాగించనున్నాం. మేం అనుసరిస్తున్న వ్యూహాలు, పెట్టుబడులు సరైన ఫలితాలిస్తున్నాయనేందుకు ఇది నిదర్శనం. అన్ని వ్యాపార విభాగాల్లో క్లయింట్ల నుంచి డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ జోరందుకోవడం, బ్యాంకింగ్‌–ఫైనాన్షియల్‌ సేవలు, రిటైల్‌లో వ్యాపార వృద్ధితో ఆదాయాలు భారీగా పెరిగాయి’. 
– రాజేష్‌ గోపీనాథన్, టీసీఎస్‌ సీఈఓ–ఎండీ   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement