మిత్సుయీ సంస్థలతో అంబానీల ఒప్పందాలు
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన అంబానీ బ్రదర్స్ జపాన్‌కు చెందిన రెండు సంస్థలతో విడిగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్ని గంటల తేడాలో కుదిరిన ఈ రెండు ఒప్పందాలూ మిత్సుయీ పేరుతో ఉన్న రెండు జపనీస్ కంపెనీలు కావడం విశేషం. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ జపాన్‌లోని అతిపెద్ద ఫైనాన్షియల్ సంస్థ సుమితోమో మిత్సుయీ ట్రస్ట్ బ్యాంక్(ఎస్‌ఎంటీబీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్‌ఎం టీబీని వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకోవడంద్వారా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించే ప్రతిపాదనలతోపాటు ఇతర బిజినెస్‌లకు ఊపు తీసుకురానుంది. ఇక మరోవైపు ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) జపాన్‌లోని అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ మిత్సుయీ ఓఎస్‌కే లైన్స్(ఎంవోఎల్)తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా ఉత్తర అమెరికా నుంచి ద్రవరూప(లిక్విఫైడ్) ఇథేన్‌ను దేశానికి రవాణా చేసుకోనుంది.
రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను పటిష్టపరచుకునే బాటలో సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో రెండు దేశాల సంస్థలూ ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రిలయన్స్ పేరుతో ఉన్న అంబానీ బ్రదర్స్‌కు చెందిన సంస్థలను పోలి ఎస్‌ఎంటీబీ, ఎంవోఎల్ రెండూ మిత్సుయీ పేరు కలిగి ఉన్నప్పటికీ ప్రత్యేక సంస్థలు కావడం గమనార్హం.
రూ. 371 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్: రిలయన్స్ క్యాపిటల్‌లో తొలి దశకింద ఎస్‌ఎంటీబీ 2.77% వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు షేరుకి రూ. 530 ధరలో రూ. 371 కోట్లను ఇన్వెస్ట్ చేస్తుంది. ఆర్‌బీఐ నిబంధనలు అనుమితిస్తే ఎస్‌ఎంటీబీ సహకారంతో కొత్తగా బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని రిల యన్స్ క్యాపిటల్ భావిస్తోంది. కాగా, ఇథేన్ రవాణాకు ఎంవోఎల్‌తో కుదుర్చుకున్న డీల్ ఆర్థిక వివరాలను ఆర్‌ఐఎల్ వెల్లడించలేదు.