
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్యతరహా కంపెనీల స్టాక్ ఎక్సే్చంజ్ అయిన ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో ఇప్పటి వరకు 140 కంపెనీలు నమోదుకాగా.. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 కంపెనీలున్నాయి. ఎమర్జ్‌లో లిస్టింగ్‌కు మరో 30 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ఎన్‌ఎస్‌ఈ ప్రతినిధి గురువారం ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఎక్కువ కంపెనీలున్నాయన్నారు. మొత్తం 18 రంగాల్లో ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ కంపెనీలు ఐపీఓ ద్వారా కనీసం రూ.4 కోట్లు, గరిష్టంగా రూ.85 కోట్లు సమీకరించాయి. వీటి క్యాపిటలైజేషన్ రూ.11,000 కోట్లు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఎంఈలన్నీ గడిచిన ఏడాది కాలంలోనే లిస్ట్ అవడం విశేషం.
నెలరోజుల్లోపే అనుమతి..: సాధారణంగా ఐపీఓకు వెళ్లాలంటే కంపెనీలకు సెబీ అనుమతి తప్పనిసరి. ఎస్‌ఎంఈలకు మాత్రం ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్‌ఎస్‌ఈ అనుమతులిస్తోంది. మూడేళ్లు వ్యాపారంలో ఉండి, రెండేళ్లు లాభాలు ఆర్జించిన కంపెనీలు ఎమర్జ్ ద్వారా ఎక్సే్చంజ్‌లో నమోదు కావొచ్చని ఎన్‌ఎస్‌ఈ ప్రతినిధి తెలియజేశారు. దరఖాస్తు చేసుకున్న మూడు నుంచి నాలుగు వారాల్లోనే అనుమతులిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఎస్‌ఎంఈ క్లస్టర్లు, పారిశ్రామిక సంఘాల ద్వారా చిన్న కంపెనీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో ఎస్‌ఎస్ ఇన్‌ఫ్రా లిస్టింగ్
ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీ ఎస్‌ఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్స్ గురువారం ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో లిస్ట్ అయింది. ఇటీవలే ఐపీవో ద్వారా ఈ కంపెనీ రూ.17 కోట్లను సమీకరించింది. ఐపీవో 10.98 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ నిధులను మూలధన అవసరాలకు, నూతన విభాగాల్లో ఎంట్రీకి వినియోగించనున్నట్టు సంస్థ సీఎండీ సత్యనారాయణ సుందర ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ఆర్డర్ బుక్ రూ.120 కోట్లుంది. ఏటా రూ.40 కోట్ల కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. 2017–18లో కంపెనీ టర్నోవరు రూ.31 కోట్లు. ఈ ఆర్థిక ఇది రూ.50 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. నికరలాభం 18–20 శాతం ఉండొచ్చు’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment