ఏపీ సర్కిల్ బీఎస్ఎన్ఎల్ 6% వృద్ధి
విలేకరుల సమావేశంలో సీజీఎం మురళీధర్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధి టెలికంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఆర్థిక సంత్సరం రెవెన్యూలో ఆరు శాతం వృద్ధి సాధించామని బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ టెలికం చీఫ్ జనరల్‌మేనేజర్ మురళీధర్ తెలిపారు. శుక్రవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ నెట్‌వర్క్ అపరేటర్లతో పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా వేగవంతమైన నెట్‌వర్క్ అందించటం కోసం అత్యాధునిక జడ్‌టీఎక్స్ టెక్నాలజీ కలిగిన 1415.. 3జీ బిటిఎస్‌లను సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తుందన్నారు. దీని వల్ల ప్రతి మండల కేంద్రంలో 3జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు.
ఇటీవల రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ పై డేటా వినియోగం ఐదు రెట్లు పెరిగిందన్నారు. గతంలో సర్కిల్ పరిధిలో ఐదు టెరాబైట్లు ఉండగా ప్రస్తుతం 30టెరాబైట్లకు పెరిగిందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ అందుబాటులేని ప్రాంతాల్లో హాట్ స్పాట్ ద్వారా వైఫై సిగ్నల్ అందిస్తున్నామన్నారు. జిల్లాలో అమరావతి రాజధానిలో ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ వర్కింగ్ అవసరాల కోసం కార్యాలయాలు, ఎక్స్ఛేంజ్‌ల నిర్మాణానికి 11 ఎకరాల స్థలం అవసరం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ప్రైవేట్ టెలికం అపరేటర్లు నుంచి ఎదురౌతున్న పోటీని ఎదుర్కోవటానికి బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు సాంకేతిక అంశాల్లో స్వల్పకాలిక శిక్షణను అందజేస్తున్నామన్నారు.