కియా ‘మేడిన్‌ ఆంధ్రా’సెల్టోస్‌ వచ్చేసింది.. | AP Minister Buggana Rajendranath Release KIA Seltos Car to the Market | Sakshi
Sakshi News home page

కియా ‘మేడిన్‌ ఆంధ్రా’సెల్టోస్‌ వచ్చేసింది..

Published Fri, Aug 9 2019 4:43 AM | Last Updated on Fri, Aug 9 2019 10:50 AM

AP Minister Buggana Rajendranath Release KIA Seltos Car to the Market - Sakshi

అనంతపురం ప్లాంట్‌లో కియా ‘సెల్టోస్‌’ కారును ఆవిష్కరిస్తున్న మంత్రులు, కంపెనీ ప్రతినిధులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా భారత్‌లో తమ తొలి కారు ’సెల్టోస్‌’ను ఆవిష్కరించింది. అనంతపురం ప్లాంటులో గురువారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్‌ బాంగ్‌–కిల్, కియా మోటార్స్‌ ఇండియా ఎండీ కూక్‌ హున్‌ షిమ్‌ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టెస్టింగ్‌ చేసిన అనంతరం సెల్టోస్‌ వాహనాల పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించినట్లు కియా మోటార్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌ భట్‌ తెలిపారు.

జూలై 16న ప్రీ–బుకింగ్స్‌ ప్రారంభమైనప్పట్నుంచి కేవలం మూడు వారాల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 23,311 కార్లు బుక్‌ అయ్యాయని ఆయన వివరించారు. ఆగస్టు 22 నుంచి కారు డెలివరీలు ప్రారంభించనున్నట్లు భట్‌ వివరించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన ఎనలేని సహాయ, సహకారాల తోడ్పాటుతో మేం నిర్దేశించుకున్న రికార్డు సమయంలో సెల్టోస్‌ కార్లను ఉత్పత్తి చేయగలిగాం. భారత మార్కెట్‌కి సంబంధించిన మా నిబద్ధతకు ఈ తొలి సెల్టోస్‌ నిదర్శనం‘ అని ఈ సందర్భంగా కూక్‌ హున్‌ షిమ్‌ చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, కియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ప్లాంట్‌ నుంచి బయటికొస్తున్న కియా సెల్టోస్‌ కారు



పక్క చిత్రంలో కొత్త కారుపై సంతకాలు చేస్తున్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, రోజా తదితరులు

విదేశాలకు ఇక్కణ్నుంచే ఎగుమతులు..
సెల్టోస్‌ కారును ఇక్కణ్నుంచే దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు కియా మోటార్స్‌ ఎగుమతి చేయనుంది. భారత్‌లో కియా మోటార్స్‌ దాదాపు 2 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేసింది. ఇందులో 1.1 బిలియన్‌ డాలర్లు అనంతపురం ప్లాంటుపైనే ఇన్వెస్ట్‌ చేసింది. దీనితో 11,000 మందికి ఉపాధి లభిస్తుందని కియా తెలిపింది. వీరిలో పర్మనెంటు సిబ్బంది 4,000 మంది కాగా, 7,000 మంది తాత్కాలిక సిబ్బంది ఉంటారు.  

536 ఎకరాల్లో ప్లాంటు ..  
అనంతపురం జిల్లా పెనుగొండలో సుమారు 536 ఎకరాల్లో కియా ప్లాంటు ఏర్పాటైంది. వార్షికంగా దీని ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల కార్లు కాగా, భవిష్యత్‌లో 7 లక్షల యూనిట్లకు కియా పెంచుకోనుంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా తయారుచేసేలా ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరిలో కియా మోటార్స్‌ ట్రయల్‌ ఉత్పత్తి ప్రారంభించింది.  రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఈ ప్లాంటులో వినియోగిస్తోంది.

సెల్టోస్‌ ప్రత్యేకతలివీ ..
మధ్య స్థాయి స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల కోవకి చెందినది కియా సెల్టోస్‌. కొత్తగా ప్రకటించిన బీఎస్‌6 కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా సెల్టోస్‌ కార్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. 1.5 పెట్రోల్, 1.5 డీజిల్, ఈ విభాగంలో తొలిసారిగా 1.4 టర్బో పెట్రోల్‌ వేరియంట్స్‌లో కారు లభిస్తుంది. వాహనదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా 3 ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్స్‌లోను, 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌లలోనూ సెల్టోస్‌ లభిస్తుంది.

సంపూర్ణ సహకారం

వైజాగ్‌–చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు
ఆర్టీసీలో క్రమంగా అన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులు
సెల్టోస్‌ ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సందేశం


ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలతో పాటు రాయితీలు కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు. దివంగత నేత, తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నానని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ద్వారా పంపిన సందేశంలో జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. వాస్తవానికి కియా సెల్టోస్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా రావాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో పరిణామాలతో పాటు గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించే పని ఉండటంతో హాజరుకాలేకపోయారని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.

పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటు..
‘‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వ ఆకాంక్ష. వాస్తవానికి కియా మోటార్స్‌ ఏర్పాటు అనేది దివంగత నేత, మా నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డికి 2007లో హ్యుందాయ్‌ మోటార్స్‌ సంస్థ ఇచ్చిన హామీ. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్‌ను కియా ఏర్పాటు చేసింది. అందువల్ల వ్యక్తిగతంగా హాజరుకావాలని భావించాను. అయితే, అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీనిస్తున్నాను. కియా ఏర్పాటు వల్ల ఇక్కడ ఆటోమొబైల్‌ రంగంతో పాటు విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. విశాఖపట్నం–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటు వల్ల పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ఈ   కారిడార్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.  

ఆటోమొబైల్‌కు అనుకూలం..
‘‘అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఆటోమొబైల్‌ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఎక్కువగా ఉంది.  ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది’’ అని జగన్‌ తెలిపారు. ఇక రాష్ట్రంలో ఆర్టీసీలో ప్రస్తుతమున్న బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడతామని ప్రకటించారు. కియాకు ఏపీఐఐసీ మరో 143 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకు కచ్చితంగా 75 శాతం ఉద్యోగాలివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి అనుగుణంగా కియా మోటార్స్‌ కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఆమె సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement