అమ్మకాల పెంపు కోసం కంపెనీ కొత్త వ్యూహం | apple phone an increase in sales for the company's new an array | Sakshi
Sakshi News home page

అమ్మకాల పెంపు కోసం కంపెనీ కొత్త వ్యూహం

Published Wed, Mar 19 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

అమ్మకాల పెంపు కోసం కంపెనీ కొత్త వ్యూహం

అమ్మకాల పెంపు కోసం కంపెనీ కొత్త వ్యూహం

కోల్‌కత/ముంబై: వంద కోట్ల జనాభాను దాటేసిన ఇండియా అంటే... ఏ స్మార్ట్ ఫోన్‌కైనా చాలా కీలకమైన మార్కెట్టే. దీన్ని బాగా అర్థం చేసుకున్న శామ్‌సంగ్... కొత్త మోడళ్లు విడుదల చేస్తూ, డీలర్ నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ మొత్తానికి పాగా వేసేసింది. వేరెవ్వరికీ అందనంత ఎత్తులో కూర్చుంది. అయితే శామ్‌సంగ్‌కు ఏమాత్రం తీసిపోని ఉత్పత్తులున్న యాపిల్ మాత్రం ఇక్కడ నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టక కాస్త వెనకబడింది.

 ఇపుడా లోటు భర్తీ చేసుకుని భారత్‌లో అమ్మకాలు పెంచుకోవడంపై కంపెనీ దృష్టి పెడుతోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తో పాటు చిన్న షాపుల్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న శామ్‌సంగ్ నుంచి మరింత మార్కెట్ వాటా రాబట్టం లక్ష్యంగా పావులు కదుపుతోంది.

 రెండేళ్లుగా యాపిల్ దృష్టి...
 వేగంగా వృద్ధి చెందుతున్న రెండో మొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో  శామ్‌సంగ్ విస్తృతంగా చొచ్చుకుపోయింది. వెయ్యికి పైగా స్మార్ట్ కేఫ్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు విక్రయిస్తోంది. రిటైల్ మార్కెట్లో అట్టడుగునున్న యాపిల్ కంపెనీ గత రెండేళ్ల నుంచే భారత్‌పై దృష్టి పెడుతోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వివిధ ఫైనాన్స్ పథకాల ద్వారా యాపిల్ ఐఫోన్లు, ట్యాబ్లెట్ల అమ్మకాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా మరో అడుగు వేసి తనకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్న రెడింగ్టన్, ఇన్‌గ్రామ్ మైక్రోల ద్వారా చిన్న షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది. వీటితో సంబంధం లేకుండా చిన్న స్టోర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న రిటైలర్లు, భాగస్వాములతో నేరుగా యాపిల్ కంపెనీయే చర్చలు జరుపుతోంది. 400-600 చదరపుటడుగుల ఎక్స్‌క్లూజివ్ యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, ఎంట్రీ లెవల్ మ్యాక్ కంప్యూటర్లు, ఐపాడ్‌లను ఈ స్టోర్లలో విక్రయించనున్నారు.

 ఐఫోన్4పైనే...: ఈ స్టోర్స్ ద్వారా యాపిల్ ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐప్యాడ్ మిని, ఐప్యాడ్2 వంటి రూ.30,000 లోపు ఉత్పత్తులను ఎక్కువగా విక్రయించాలనేది యాపిల్ యోచన. ఐఫోన్ 5సీ ధర రూ.41,900గా ఉంది. అందుకే కంపెనీ ఐఫోన్ 4ను రూ.21,000కు విక్రయించనుంది. ఈ ధరలో యాపిల్ ఐఫోన్ వస్తుందంటే కొనడానికి చాలామంది ముందుకొస్తారని కంపెనీ భావిస్తోంది. పోష్ లొకాలిటీల్లో ఈ స్టోర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ చూస్తోంది. వైజాగ్, గౌహతి, పుణే వంటి నగరాల్లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు అధికంగా ఉండటంతో ఈ తరహా నగరాలపై అధికంగా దృష్టి పెడుతోంది.
 లాభాలు తక్కువ...
 చిన్న స్టోర్ల గురించి వివిధ ఏజెన్సీలు వార్తలిస్తున్నప్పటికీ వీటిపై వ్యాఖ్యానించడానికి యాపిల్ నిరాకరించింది. మరోవైపు యాపిల్ ఉత్పత్తులపై మార్జిన్లు తక్కువని కొన్ని ఎలక్ట్రానిక్ రిటైల్ చెయిన్స్ చెబుతున్నాయి. డిస్కౌంట్లు ఇచ్చినా శామ్‌సంగ్, ఇతర బ్రాండ్లపై 7-10% లాభాలొస్తాయని, యాపిల్ ఉత్పత్తులపై 2-5 శాతమే వస్తాయనేది ఆ రిటైల్ చెయిన్స్ నిర్వాహకుల మాట. మార్కెట్ నిపుణులు మాత్రం... కాస్తంత సమయం పట్టినా యాపిల్ తాజా ప్రతిపాదన విజయం సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలసిస్ అంచనా ప్రకారం గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ వాటా 2%గానే ఉం ది. శామ్‌సంగ్ వాటా 32%, మైక్రోమ్యాక్స్ వాటా 21%గా ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement