అక్టోబర్ చివరి నుంచి విలీన ప్రక్రియ: ఎస్బీఐ
ముంబై: ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేసే ప్రక్రియ వచ్చే నెల చివరి నాటికి ఆరంభం కానుండగా... మార్చి చివరికి పూర్తి అవుతుందని ఎస్‌బీఐ భావిస్తోంది. విలీనానికి ఎస్‌బీఐ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపి షేర్ల మార్పిడి (స్వాప్ రేషియో) నిష్పత్తిని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రేషియోపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఆయా బ్యాంకుల వాటాదారులకు ఎస్‌బీఐ 21 రోజుల గడువు ఇచ్చింది. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని (గ్రీవెన్స్ కమిటీ) కూడా ఏర్పాటు చేసింది.
‘గ్రీవెన్స్ కమిటీ ఈ నెల చివరి నాటికి సానుకూల ప్రతిపాదనతో వస్తుందని భావిస్తున్నాం. కమిటీ సిఫారసులపై ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆర్‌బీఐ, ప్రభుత్వం వద్దకు తుది అనుమతి కోసం పంపిస్తాం. ఇందుకు ఓ నెల సమయం తీసుకుంటుంది. విలీన ప్రక్రియ అక్టోబర్ చివరికి ప్రారంభం అవుతుంది’ అని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. మనది స్వేచ్ఛాయుత దేశమని న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ కేరళ కోర్టులో ఇప్పటికే ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.