
న్యూఢిల్లీ: విమానయాన సేవల్లో ఎయిర్ ఇండియా సంస్థను కింగ్‌ఫిషర్ మాదిరిగా తయారు చేయాలని ప్రభుత్వం కోరుకోవడం లేదంటూ కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా దేశానికి సేవలందించాలనే తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న ఏ ఒక్కరూ ఉద్యోగం కోల్పోవాలని కోరుకోవడం లేదని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలియజేశారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన మంత్రివర్గ కమిటీ ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని పరిశీలిస్తోందని, ఎంపీలు సహా ఎవరైనా తమ సూచనలను కమిటీకి తెలియజేయవచ్చని చెప్పారాయన.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించే ప్రతిపాదనేదీ లేదని అటు రాజ్యసభలోనూ కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.51,890 కోట్ల రుణ భారం మోస్తున్నట్టు సిన్హా తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థను గాడిన పడేసేందుకు గాను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం జూన్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment