ముంబై: హిందుజా గ్రూప్‌కు చెందిన వాహన దిగ్గజ కంపెనీ అశోక్ లేలాండ్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలానికి రూ.334 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.294 కోట్ల నికర లాభం వచ్చిందని అశోక్ లేలాండ్ పేర్కొంది. గత క్యూ2లో రూ.4,943 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.6,102 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎఫ్‌ఓ గోపాల్ మహదేవన్ తెలిపారు. ఆదాయం అధికంగా రావడం, ఎగుమతులు 39 శాతం పెరగడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 1న హిందుజా ఫౌండరీస్‌ను విలీనం చేసుకున్నందున గత క్యూ2 ఫలితాలతో, ఈ క్యూ2 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. ఈ క్యూ2లో 10 శాతం ఇబిటా మార్జిన్ సాధించామని, గత 11 క్వార్టర్లలో రెండంకెల ఇబిటా మార్జిన్‌ను వరుసగా పది క్వార్టర్లలో సాధించామని వివరించారు. గత క్యూ2లో రూ.536 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ2లో రూ.612 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
ఎగుమతులు 39 శాతం అప్..
ఈ క్యూ2లో ఎగుమతులు 39 శాతం వృద్ధితో 4,437కు పెరిగాయని మహదేవన్ చెప్పారు. ఇక దేశీయంగా మీడియమ్, భారీ వాణిజ్య వాహన విక్రయాలు 22 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. గత క్యూ2లో 8,100గా ఉన్న తేలిక రకం వాణిజ్య వాహన అమ్మకాలు ఈ క్యూ2లో 18 శాతం వృద్ధితో 9,588కు పెరిగాయని పేర్కొన్నారు.
ఫలితాలు సంతృప్తికరం...
ఆర్థిక ఫలితాలు బాగా ఉన్నాయని మహదేవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. వర్కింగ్ క్యాపిటల్ తగిన స్థాయిలోనే ఉందని, రుణ–ఈక్విటీ నిష్పత్తి 0.35:1 గా ఉందని పేర్కొన్నారు. లాభదాయక వృద్ధి బాటను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, తమ మార్కెట్ వాటా పెరిగిందని అశోక్ లేలాండ్ ఎండీ, వినోద్ కె. దాసరి చెప్పారు. ఐఈజీఆర్ టెక్నాలజీతో రూపొందించిన బీఎస్ ఫోర్ వాహనాలకు మంచి స్పందన లబిస్తోందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అశోక్ లేలాండ్ షేర్ 2 శాతం నష్టపోయి రూ.119 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి, రూ.74గానూ, గరిష్ట స్థాయి రూ.133 గానూ ఉన్నాయి.
అశోక్ లేలాండ్ లాభం 334 కోట్లు
Published Thu, Nov 9 2017 12:27 AM | Last Updated on Thu, Nov 9 2017 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment