న్యూఢిల్లీ: హిందుజాల ప్రధాన కంపెనీ, అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 3 రెట్లు పెరిగింది. గత క్యూ1లో నికర లాభం స్డాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.111 కోట్లుగా ఉండగా, ఈ క్యూ1లో రూ.370 కోట్లుగా ఉందని అశోక్ లేలాండ్ తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని కంపెనీ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. గత క్యూ1లో ఆదాయం రూ.4,534 కోట్లు కాగా, ఈ క్యూ1లో రూ.6,250 కోట్లకు చేరిందన్నారు.
‘‘గత ఏడాది జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున గత క్యూ1, ఈ క్యూ1 లాభాలను, ఆదాయ గణాంకాలను పోల్చడానికి లేదు. మౌలిక రంగంపై పెట్టుబడులు పెరగడం, గత క్యూ1లో బేస్ బాగా తక్కువగా ఉండటం వంటి కారణాలతో వాహన పరిశ్రమ అమ్మకాలు 84 శాతం ఎగిశాయి. గత క్యూ1లో 28,498గా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ1లో 42,128కు పెరిగాయి. దేశీయ అమ్మకాలు 51%, ఎగుమతులు 22% ఎగిశాయి’’ అని వినోద్ కె. దాసరి వివరించారు.
ఇంటర్మీడియట్ కమర్షియల్ వెహికల్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, బస్సుల విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని తెలిపారు. భారీ డిస్కౌంట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిశ్రమలో వర్కింగ్ క్యాపిటల్‌పై కఠినమైన నియంత్రణ పాటిస్తున్నామని, లాభదాయకత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీఎస్‌ఈలో అశోక్ లేలాండ్ షేర్
2% లాభంతో రూ.129 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment