అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ కట్ | Ashok Leyland, Nissan sign restructuring agreement for 3 JVs | Sakshi
Sakshi News home page

అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ కట్

Published Thu, Sep 8 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ కట్

అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ కట్

మూడు జేవీల్లో నిస్సాన్ వాటాల కొనుగోలుకు అశోక్ లేలాండ్ ఓకే
ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం...

న్యూఢిల్లీ: జపాన్ వాహన దిగ్గజం నిస్సాన్‌తో ఎనిమిదేళ్ల అశోక్ లేలాండ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇరు కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన మూడు జాయింట్ వెంచర్ల(జేవీ) నుంచి వైదొలగాలని నిస్సాన్ మోటార్ కంపెనీ నిర్ణయించింది. ఈ మూడు జేవీల్లో తమ వాటాలను అశోక్ లేలాండ్‌కు విక్రయించేందుకు బుధవారం ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఒక సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు వెల్లడించాయి.

2008 మే నెలలో అశోక్ లేలాండ్ నిస్సాన్ వెహికల్స్(ఏఎల్‌ఎన్‌వీఎల్) పేరుతో వాహన తయారీ జేవీ, అదేవిధంగా ఇంజిన్ల ఉత్పత్తి కోసం నిస్సాన్ అశోక్ లేలాండ్ పవర్ ట్రెయిన్(ఎన్‌ఏఎల్‌పీటీ), సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి నిస్సాన్  అశోక్ లేలాండ్ టెక్నాలజీస్(ఎన్‌ఏఎల్) అనే మూడు జేవీలను ఈ కంపెనీలు నెలకొల్పాయి. వీటిలో ఈక్విటీ రూపంలో దాదాపు రూ.1,000 కోట్లను పెట్టుబడిగా పెట్టాయి. కాగా, ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మూడు జేవీలు ఇక అశోక్ లేలాండ్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లుగా మారతాయని, భారత్‌లోని వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల మేరకు ఈ డీల్ పూర్తవుతుందని సంయుక్త ప్రకటన తెలిపింది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు.

దోస్త్, ఇతర ఎస్‌సీవీలకు తోడ్పాటు...
అశోక్ లేలాండ్‌తో జేవీల నుంచి వైదొలగినప్పటికీ... కొన్ని వాహనాలకు సంబంధించి లెసైన్సింగ్‌కు ఇరు కంపెనీలు అంగీకరించాయి. ప్రధానంగా దోస్త్, ఇతర లైట్ కమర్షియల్ వాహనాల(ఎల్‌సీవీ)కు కొత్తగా లెసైన్సింగ్ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుంది. వీటికి ఇంజినీరింగ్, టెక్నాలజీ, డిజైన్‌ను నిస్సాన్ సమకూర్చింది. అదేవిధంగా కస్టమర్లకు సర్వీసింగ్, విడిభాగాల లభ్యత వంటివి కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయి. మరోపక్క, దేశీయంగా తయారైన విడిభాగాల కొనుగోలును నిస్సాన్ కొనసాగించేందుకు కూడా ఇరు కంపెనీలు అంగీకరించాయి.

ఎందుకీ తెగదెంపులు...
వాస్తవానికి మూడు జేవీల్లో ఒకదాని నుంచి వైదొలగుతామంటూ ఈ ఏడాది ఆరంభంలోనే నిస్సాన్ టెర్మినేషన్ నోటీసులను అశోక్ లేలాండ్‌కు పంపింది. యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక స్కీమ్(ఈపీసీజీ) నిబంధనలను రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అశోక్ లేలాండ్ కోర్టుకెళ్లడంతో ఇరు కంపెనీల మధ్య విభేధాలు మొదలయ్యాయి. అంతేకాకుండా జేవీల ద్వారా విడుదల చేసిన పలు మోడల్స్ మార్కెట్లో అంతగా విజయవంతం కాకపోవడం కూడా దీనికి కారణంగా నిలిచింది. ఇవాలియా ఎంపీవీని నిస్సాన్ నిలిపివేయగా... స్టైల్ ఎంపీవీ ఉత్పత్తిని అశోక్ లేలాండ్ ఆపేసింది.

ఈ రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. అయితే, విజయవంతంగా అమ్ముడవుతున్న దోస్త్ ఎల్‌సీవీని మాత్రమే ప్రస్తుతం అశోక్ లేలాండ్ కొనసాగిస్తోంది. అతేకాకుండా దోస్త్‌కు సంబంధించి నిస్సాన్ అధిక రాయల్టీని డిమాండ్ చేయడం కూడా అశోక్ లేలాండ్‌కు నచ్చలేదు. అయితే, జేవీ ద్వారా తమకంటే తమ భాగస్వామే ఎక్కువగా లాభపడుతోందని నిస్సాన్ భావిస్తూవచ్చింది. ఈ పరిణామాలన్నీ చివరకు భాగస్వామ్యం ముగిసేలా చేసింది.

మూడు జేవీల్లో నిస్సాన్ వాటాను కొనుగోలు చేయడానికి మేం అంగీకరించాం. మా  కీలక వాహన వ్యాపారంపై మరింత దృష్టిపెట్టేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయి. అదేవిధంగా తాజా లెసైన్సింగ్ ఒప్పందం మేరకు నిస్సాన్‌తో మా బంధం కొనసాగుతుంది’.
- వినోద్ దాసరి, అశోక్ లేలాండ్ ఎండీ

భారత్‌లో మా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తాం. వాహనాల తయారీ, పరిశోధన-అభివృద్ధితో పాటు సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇక్కడి మార్కెట్లో ప్రధాన వాహన కంపెనీగా అవిర్భవించే సన్నాహాల్లో ఉన్నాం. అశోక్ లేలాండ్‌తో కొత్తగా కుదిరిన లెసైన్సింగ్ ఒప్పందం ప్రకారం ఎల్‌సీవీ కస్టమర్లకు నిస్సాన్ ఇంజనీరింగ్, సర్వీసింగ్, విడిభాగాల లభ్యతకు ఎలాంటి ఢోకా ఉండదు’.  - ఫిలిప్ గురిన్-బౌటాడ్, స్సాన్ గ్లోబల్ ఎల్‌సీవీ బిజినెస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement