
న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ, అశోక్ లేలాండ్ నికర లాభం 2017–18 జనవరి–మార్చి క్వార్టర్‌లో 40 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.476 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.667 కోట్లకు పెరిగిందని అశోక్ లేలాండ్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,133 కోట్ల నుంచి రూ8,830 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2.43 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,612 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధితో రూ.1,816 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో చాలా ఘనతలు సాధించామని, ఇది అత్యంత సంతృప్తికరమైన సంవత్సరమని వినోద్ చెప్పారు. రికార్డ్ స్థాయి లాభాలను, ఆదాయాన్ని సాధించామని, ఏడాది చివరినాటికి నగదు నిల్వలు రూ.3,000 కోట్లకు పెరిగాయని కంపెనీ సీఎఫ్‌ఓ గోపాల్ మహదేవన్ తెలిపారు.
ఎగుమతులు జోరుగా పెరిగాయని, అంతర్జాతీయ వ్యాపారం వృద్ధి, రక్షణ, విక్రయానంతర సేవల సెగ్మెంట్లు కూడా మంచి వృద్ది సాధించేందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని దాసరి పేర్కొన్నారు. అశోక్ లేలాండ్ వెహికల్స్, ఆష్లే పవర్‌ట్రెయిన్, అశోక్ లేలాండ్ టెక్నాలజీస్.. ఈ మూడు కంపెనీలను అశోక్ లేలాండ్‌లో విలీనం చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఈ విలీనానికి సంబంధిత ఇతర ఆమోదాలు పొందాల్సి ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment