ఆస్తి మీది బాధ్యత మాది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న ఫ్లాట్‌కు సంబంధించిన అద్దె సొమ్ము ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోన్న రాజుకు నెలనెలా ఠంఛనుగా అందుకుంటున్నాడు. విద్యుత్తు, ఆస్తి పన్ను బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నాడు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అవును ‘ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)తో ఇది సాధ్యమే. మీ చిన్న చిన్న పనుల్ని దగ్గరుండి చేసి పెట్టడమే వీటి ప్రత్యేకత.
సేవల చిట్టా పెద్దదే..
పీఎంఎస్ అని ముద్దుగా పిలిచే ఈ సేవల ద్వారా కలిగే ప్రయోజం అంతాఇంతా కాదు. ప్రతి పనిని దగ్గరుండి ఈ ప్రతినిధులే చూసుకుంటారు. ఏయే సేవల్ని వీరు అందిస్తారో ఒకసారి చూద్దామా...
⇔ నెల వచ్చేసరికి ఠంఛనుగా అద్దె చెల్లించగల వ్యక్తులకే మీ ఇంటిని లేదా ఫ్లాట్‌ను అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు, అద్దెదారునికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. దీనికి అవసరమైన పత్రాల్ని రూపొందించే బాధ్యత వీరిదే. అద్దెదారులు పాటించాల్సిన నియమ నిబంధల్ని మీ తరఫున ఖారారు చేస్తారు.
⇔ క్రమం తప్పకుండా అద్దె వసూలు చేసి మీ బ్యాంకు ఖాతాలో జమ చేయటం వీరి సేవలో భాగమే.
⇔ మీది ఫ్లాట్ అయితే అపార్ట్‌మెంట్ సంఘానికి ప్రతినెలా నిర్వహణ ఖర్చులను ఇంటి అద్దె నుంచి చెల్లిస్తారు.
⇔ ప్లంబింగ్, విద్యుత్, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర సమస్యలు వస్తే వాటికి తగిన మరమ్మతులు చేయిస్తారు.
⇔ అవసరమైన సందర్భాలలో మీ ఖర్చుతో ఇంటికి రంగులు వేయిస్తారు.
⇔ విద్యుత్, ఆస్తి పన్ను బిల్లులను చెల్లిస్తారు.
⇔ మీకు అద్దెదారునికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత వీరిదే.
⇔ నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేదీ వీరే.
⇔ మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. మంచి ధరను ఇప్పించేందుకు కృషి చేస్తారు.
⇔ పని ఏదైనా మీకు తెలియకుండా జరగదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిసేవకు ఎంతోకొంత రుసుము చెల్లించాల్సిందే. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. అయితే సంస్థను బట్టి వసూలు చేసే రుసుముల్లో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు.