
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలను జాతీయ రహదారులతో మరింత మెరుగ్గా అనుసంధానించిన దార్శనికుడు... దేశీయంగా చమురు, సహజవాయువు ఉత్పత్తి పెంపుతోపాటు, విదేశాల్లో కొనుగోళ్ల ద్వారా ఇంధన భద్రత దిశగా అడుగులు వేసిన మార్గదర్శి. ఆయనే అటల్ బిహారీ వాజ్‌పేయి. 93ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన వాజ్‌పేయిని, ఆయన దేశ ప్రధానిగా సేవలు అందించిన సమయంలో చేపట్టిన కార్యక్రమాలను మననం చేసుకోవడం సందర్భోచితం.
ఆధునిక భారత్‌కు వాజ్‌పేయి బలమైన విధాన సంస్కరణలు చేపట్టారు. అందుకే రెండో తరం ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా వాజ్‌పేయిని పేర్కొంటారు. 1990 దశకంలో తొలిసారి ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును సంస్కరణల పితామహుడిగా పేర్కొనే విషయం విదితమే.
జాతీయ రహదారుల విస్తరణ
2001లో స్వర్ణ చతుర్భుజి పేరుతో, ఉత్తర–దక్షిణ, తూర్పు–పశ్చిమ కారిడార్ ప్రాజెక్టులను వాజ్ పేయి ఆరంభించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా మెట్రో నగరాలను 4, 6 లేన్ల రహదారులతో అనుసంధానం... శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు, పోర్‌బందర్ నుంచి సిల్చార్ వరకు జాతీయ రహదారులతో అనుసంధానించడమే ఈ కార్యక్రమాల లక్ష్యం. అమెరికా అభివృద్ధికి రహదారుల నెట్‌వర్క్ ఎలా తోడ్పడిందో, మన దగ్గరా అభివృద్ధికి మౌలిక సదుపాయాల అవసరాన్ని గుర్తించి చేపట్టిన కార్యక్రమం ఇది. తర్వాత ప్రభుత్వాలు సైతం వాజ్‌పేయి చూపిన బాటలోనే కొనసాగుతూ జాతీయ రహదారుల విస్తరణ దిశగా చర్యలు తీసుకున్నాయి.
ప్రైవేటీకరణ
మరో ముఖ్య కార్యక్రమం ప్రభుత్వరంగ సంస్థల పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ. వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 32 ప్రభుత్వరంగ కంపెనీలు, హోటళ్లను ప్రైవేటు సంస్థలకు అమ్మేశారు. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రత్యేకంగా ‘పెట్టుబడుల ఉపసంహరణ విభాగం’ను, పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు కేబినెట్ కమిటీ ఏర్పాటు వాజ్‌పేయి పాలనలోనే చోటుచేసుకున్నాయి.
మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్‌ను 1999–2000లో హిందుస్తాన్ యూనిలీవర్‌కు విక్రయించడంతో అమ్మకాల పరంపర మొదలైంది. ఆ తర్వాత భారత్ అల్యూమినియం (బాల్కో), హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ వాటాలను అనిల్ అగర్వాల్‌కు చెందిన స్టెరిలైట్ ఇండస్ట్రీస్ (ప్రస్తుత వేదాంత)కు కట్టబెట్టారు. ఐటీ సంస్థ సీఎంసీ, టెలికం కంపెనీ విదేశ్ సంచార్ నిగమ్ (వీఎస్‌ఎన్‌ఎల్)ను టాటాలకు, పెట్రోల్ రిటైలింగ్ సంస్థ ఐబీపీని ఐవోసీకి, ఐపీసీఎల్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టారు.
నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయంలో వాజ్‌పేయి సర్కారు ఎంతో వ్యతిరేకత చవిచూసింది. ముఖ్యంగా బాల్కో ప్రైవేటీకరణ సుప్రీంకోర్టు వరకు వెళ్లగా, ప్రభుత్వానికి అనుకూల తీర్పు వెలువడింది. అయితే, హెచ్‌పీసీఎల్‌ను సైతం ప్రైవేటీకరించాలనుకోగా, కేబినెట్ సహచరుల నుంచే వ్యతిరేకత రావడంతో అది వెనక్కు వెళ్లిపోయింది.
విదేశీ చమురు నిక్షేపాలపై కన్ను
దేశాభివృద్ధికి ఇంధన భద్రత అవసరాన్ని గుర్తించి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుని తన దార్శనికతను వాజ్‌పేయి నిరూపించుకున్నారు. రష్యాలోని సఖాలిన్–ఐ చమురు, గ్యాస్ క్షేత్రాల్లో 20 శాతం వాటాను 1.7 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో భారత్ తరఫున ఒకానొక అతిపెద్ద పెట్టుబడి ఇది. దీని తర్వాత సుడాన్‌లోని చమురు క్షేత్రంలోనూ 25 శాతం వాటాను 720 మిలియన్ డాలర్లతో కొనుగోలుకు నిర్ణయం జరిగింది. రిస్క్‌తో కూడిన దేశాల్లో ఇంత భారీ పెట్టుబడులు ఏమిటన్న విమర్శలను వాజ్‌పేయి ఎదుర్కొన్నారు.
కానీ, ఆ తర్వాత ఇవి సరైనవిగా రుజువయ్యాయి. నాడు వాజ్‌పేయి హయాంలో విదేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో పెట్టుబడుల ద్వారా ఇంధన భద్రతకు చేపట్టిన విధానం ఆ తర్వాత కూడా ఆగలేదు. ప్రస్తుతం 20 దేశాల్లోని చమురు, గ్యాస్ నిల్వల్లో భారత కంపెనీలకు వాటాలున్నాయి. విదేశాలతో భారత సంబంధాల్లో ఇంధన దౌత్యం కూడా నేడు ప్రముఖమైనది కావడం గమనార్హం. ఇక, పెట్రోల్ దిగుమతి భారాన్ని కొంత వరకైనా తగ్గించేందుకు చెరకు నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కొంత వరకు కలిపి విక్రయించే విధానాన్ని వాజ్‌పేయి ప్రభుత్వంలోనే ప్రారంభించారు. దీని ద్వారా చెరకు రైతులకు అదనపు ఆదాయ మార్గాన్ని కూడా చూపించారు.
సామాన్యులకూ మొబైల్ యోగం..
నేడు మొబైల్ ఫోన్ సేవలు సామాన్యులను చేరుకోవడం వెనుక 1999లో వాజ్‌పేయి సర్కారు తీసుకొచ్చిన నూతన టెలికం విధానం కీలకమని చెప్పుకోవాలి. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ ఆదాయ పంపిణీ విధానానికి కొత్త విధానం దారితీసింది. దీంతో కాల్ రేట్లు తగ్గి, మొబైల్ ఫోన్ సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి.
వాజ్‌పేయికి కార్పొరేట్ల ఘన నివాళి
మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని, దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన దార్శనికునిగా ఆయన్ను ప్రస్తుతించారు.
వాజ్‌పేయి మరణ వార్త బాధాకరం. దయ, హాస్యచతురత ఉన్న గొప్ప నేత. మనలో చాలా మంది అభిమానించే వ్యక్తిగా ఆయన గుర్తుండిపోతారు. – రతన్ టాటా, టాటాట్రస్ట్ చైర్మన్
అటల్ జీ జాతికి వెలుగు చూపించారు. మార్కెట్ సంస్కరణల ద్వారా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడిన వ్యక్తి. తన దార్శనిక నాయకత్వంలో ప్రవేశపెట్టిన రెండో తరం సంస్కరణలు పెట్టుబడుల వాతావరణానికి తోడ్పడ్డాయి. ఫలితంగా భారత్ వేగంగా వృద్ధి సాధించేందుకు దోహదపడింది. – రాకేశ్ భారతి మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్
గొప్ప ఆర్థిక సంస్కరణలవాది. సరళీకరణ అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలు వాస్తవ రూపం దాల్చేందుకు, అంతర్జాతీయ మార్కెట్‌కు తలుపులు తెరిచి మరింత పోటీయుత, బలమైన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు తోడ్పడుతుందని నమ్మిన వ్యక్తి. – సునీల్ భారతి మిట్టల్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు
స్వర్ణ చుతుర్భుజి ప్రాజెక్టు, నూతన టెలికం విధానం, సర్వశిక్షా అభియాన్, ఫిస్కల్ రెస్పాన్స్‌బులిటీ యాక్ట్ వంటి చర్యల ద్వారా దేశాన్ని వేగవంతమైన మార్గం వైపు వాజ్‌పేయి నడిపించారు. భవిష్యత్తు ప్రభుత్వాలు కూడా ఈ దిశలో నడిచేలా మార్గం వేశారు. – ప్రతాప్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్
వాజ్‌పేయి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారు. జాతి నిర్మాణం పట్ల ముందు చూపు కలిగిన వారు. ప్రస్తుత తరానికే కాక రాబోయే తరాలకూ స్ఫూర్తినీయులు. – సందీప్ జజోదియా, అసోచామ్ ప్రెసిడెంట్
ఈ దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది. వాజ్‌పేయి ఈ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. గొప్ప దార్శనికత, ప్రజాకర్షణ ఉన్న వ్యక్తి.
– కిరణ్‌మజుందార్ షా, బయోకాన్ చైర్‌పర్సన్
భారత కార్పొరేట్ రంగం ఓ నిజమైన భతరమాత బిడ్డను కోల్పోయింది. కీలక సమయంలో దేశాన్ని నడిపించిన వ్యక్తి. గొప్ప వక్త, ప్రజానేత.
– అనిల్ అగర్వాల్, వేదాంత గ్రూప్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment