
140 ఎకరాల సహారా భూమి వేలం
- సుబ్రతా రాయ్ బెయిలు కేసు
- కోర్టులోనే 2 రియల్టీ దిగ్గజాల పోటీ బిడ్లు
- రూ.150 కోట్ల ఆఫర్
న్యూఢిల్లీ: సహారాకు మరో ఎదురుదెబ్బ. ఆ గ్రూప్ సంస్థ ఆస్తులకు రెండు రియల్టీ దిగ్గజ సంస్థలు పోటీపోటీ బిడ్లు వేసిన వైనం సోమవారం స్వయంగా సుప్రీం... కోర్టు హాలులోనే చోటుచేసుకుంది. చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్లు డిపాజిట్ చేయాల్సిన అంశంపై జరిగిన వాదోపవాదనల సమయంలో ఈ బిడ్డింగ్ ప్రక్రియ చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా రెండు సహారా గ్రూప్ సంస్థలు నిధుల సమీకరణకేసులో, ఏడాదిన్నర నుంచీ రాయ్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
బిడ్డింగ్ విధానం...గోరఖ్‌పూర్‌లోని సహారా గ్రూప్‌కి చెందిన 140 ఎకరాల స్థలానికి సంమృద్ధి డెవలపర్స్‌రూ.64 కోట్లకు, గోరఖ్‌పూర్ రియల్టీ కంపెనీరూ.110 కోట్లకు ఆఫర్‌లు దాఖలు చేశాయి. రెండు కంపెనీలూ ఆఫర్‌ను పెంచుకుంటూ పోయాయి. చివరకు రూ.150 కోట్లకు రెండు కంపెనీలూ బిడ్ చేశాయి. రెండు కంపెనీలు ‘తమ విశ్వసనీయత’ నిరూపణలో భాగంగా... మొత్తం బిడ్‌లో 25 శాతం జూలై 31వ తేదీ లోపు సెబీ-సహారా అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.
ప్రపంచంలో ఏ కంపెనీ అంత డబ్బు చెల్లించలేదు... కేసు విచారణ సందర్భంగా సహారా చెల్లించాల్సిన మొత్తంపై మరోసారి వాడివేడి వాదనలు జరిగాయి. 18 నెలల్లో రూ.36,000 కోట్లు చెల్లించాలంటూ.. ఇంతక్రితం ఇచ్చిన రూలింగ్‌ను సవరించాలని సహారా గ్రూప్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ప్రపంచంలోని ఏ సంస్థా అంత మొత్తం సొమ్మును చెల్లించలేదని ఈ సందర్భంగా అన్నారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఇదిలావుండగా, తమ(సహారా) విదేశీ హోటళ్ల జప్తునకు జేటీఎస్ ట్రేడింగ్ సంస్థ దాఖలు చేసిన సివిల్ పిటిషన్‌ను తోసిపుచ్చాలని న్యూయార్క్ సుప్రీంకోర్టుకు సహారా విజ్ఞప్తి చేసింది.