
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని సహారా గ్రూప్‌కు చెందిన యాంబీ వ్యాలీ ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ 19న హామీ ఇచ్చిన విధంగా రూ.750 కోట్లను సెబీ–సహారా రిఫండ్ అకౌంట్‌లో డిపాజిట్ చేయడంలో సహారా గ్రూప్ వైఫల్యం చెందడం తాజా సుప్రీం స్పష్టీకరణల నేపథ్యం. యాంబీ వేలం ఆస్తులు కొన్నింటిని విక్రయించి, రూ.750 కోట్లను మే 15 నాటికి డిపాజిట్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో సహారా గ్రూప్ విఫలమయ్యిందని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
కేసు తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. సెబీ తరఫు న్యాయవాది అరవింద్ దత్తార్ ఈ సందర్భంగా సుప్రీంకు సహారా చెల్లించాల్సిన నిధుల వివరాలను తెలిపారు. దీని ప్రకారం– చెల్లించాల్సిన అసలు రూ.25,781.23 కోట్లు. ఇందులో దాదాపు రూ.14,357 కోట్లను సహారా ఇప్పడికే డిపాజిట్ చేసింది. వడ్డీతో కలుపుకుని దాదాపు రూ.18,187 కోట్లు డిపాజిట్ చేసింది. యాంబీ వ్యాలీ ఆస్తుల విక్రయాల ద్వారా మిగిలిన మొత్తాన్ని పొందాలని సుప్రీంకోర్టు ఆదేశాలు నిర్దేశిస్తున్నాయి.