
న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కారు తయారీదారు ఆడీ తన కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇయర్-ఎండ్ సేల్స్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ.8.85 లక్షల వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు శుక్రవారం తెలిపింది. ప్రత్యేక ధరలు, సులభతరమైన ఈఎంఐ ఆప్షన్లు ఆఫర్ చేయనున్నట్టు కూడా కంపెనీ పేర్కొంది. ఆడీ రష్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ఆడీ ఏ3, ఆడీ ఏ4, ఆడీ ఏ6, ఆడీ క్యూ3 మోడల్స్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లలో భాగంగా ఎంపికచేసిన మోడల్స్‌పై రూ.3 లక్షల నుంచి 8.85 లక్షల వరకు ధరల ప్రయోజనం లభించనుందని ఆడి ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2017లో వినియోగదారులు కొనే తమ ఇష్టమైన ఆడీపై అదనపు ప్రయోజనాలను కూడా అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రయోజనాల్లో భాగంగా పేమెంట్ 2019 నుంచి ప్రారంభించవచ్చు.
ఆఫర్ కింద ఆడీ ఏ3 వాహనం రూ.26.99 లక్షలకు విక్రయిస్తోంది. దీని అసలు ధర రూ.31.99 లక్షలు. ఆడీ ఏ4 ధర రూ.33.99 లక్షలు. ఆఫర్ ముందు వరకు దీని ధర రూ.39.97 లక్షలు. అదేవిధంగా రూ.53.84 లక్షలుగా ఉన్న ఆడీ ఏ6 సెడాన్ రూ.44.99 లక్షలుగా ఉంది. ఎస్‌యూవీ ఆడీ క్యూ3 రూ.29.99 లక్షలకే విక్రయానికి వచ్చింది. ఇది లిస్ట్ అయిన ధర రూ.33.4 లక్షలు. క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా ఆడీ ఈ ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.