
ఆస్ట్రేలియాలో ‘అదానీ’కి ఎదురుదెబ్బ
బొగ్గు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను కొట్టివేసిన కోర్టు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో తలపెట్టిన కార్‌మైఖేల్ బొగ్గు గనుల ప్రాజెక్టు విషయంలో మైనింగ్ దిగ్గజం అదాని గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ ప్రాజెక్టుకు లభించిన పర్యావరణ అనుమతులను ఆస్ట్రేలియా కోర్టు పక్కన పెట్టింది. దాదాపు 16.5 బిలియన్ డాలర్ల ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు, స్థానికులు కేసు దాఖలు చేయడంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గెలిలీ బేసిన్‌లోని అరుదైన జీవజాలం యకా స్కింక్, ఆర్నమెంటల్ స్నేక్‌లకు ఈ ప్రాజెక్టుతో హాని కలుగుతుందన్న విషయాన్ని పర్యావరణ మంత్రి గ్రెగ్ హంట్ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు.
దీనికి ఇచ్చిన అనుమతులకు చట్టబద్ధత లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టుకు అనుమతులను మంత్రి పునఃసమీక్షించాల్సి ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సూ హిగిన్సన్ పేర్కొన్నారు. మరోవైపు, ఇది చట్టపరమైన సాంకేతిక సమస్య మాత్రమేనని, త్వరలోనే పరిష్కారం కాగలదని అదాని గ్రూప్ తెలిపింది. అటు ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపినట్లు వస్తున్న వార్తల దరిమిలా అదాని గ్రూప్ షేరు వరుసగా రెండో రోజూ పెరిగింది. బుధవారం బీఎస్‌ఈలో సుమారు 5 శాతం పెరిగి రూ. 98.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9.11 శాతం ఎగిసి రూ. 103 స్థాయిని కూడా తాకింది.