‘ఆటో’కు కలిసిరాని అక్టోబర్‌ | Auto sales in October: Maruti stays flat, Tata Motors shows double-digit growth | Sakshi
Sakshi News home page

‘ఆటో’కు కలిసిరాని అక్టోబర్‌

Published Fri, Nov 2 2018 12:40 AM | Last Updated on Fri, Nov 2 2018 12:40 AM

Auto sales in October: Maruti stays flat, Tata Motors shows double-digit growth - Sakshi

న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు, ఇంధన రేట్ల పెరుగుదల తదితర అంశాల కారణంగా పండుగ సీజన్‌ అయినప్పటికీ వాహన తయారీ సంస్థలకు అక్టోబర్‌ అంతగా కలిసి రాలేదు. అమ్మకాలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా, హోండా కార్స్‌ వంటి దిగ్గజ సంస్థల వాహన అమ్మకాల వృద్ధి కూడా 1– 2 శాతంగా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. టాటా మోటార్స్, ఫోర్డ్‌ ఇండియా మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో విక్రయాలు నమోదు చేశాయి. మారుతీ సుజుకీ దేశీ అమ్మకాలు 1,38,100 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 1.5 శాతం అధికం. ఆల్టో, స్విఫ్ట్, బాలెనో వంటి మినీ, కాంపాక్ట్‌ సెగ్మెంట్‌ కార్ల అమ్మకాలు మెరుగ్గానే ఉన్నా... యుటిలిటీ వాహనాల విక్రయాలు మాత్రం తగ్గాయి. మరోవైపు, పోటీ సంస్థ హ్యుందాయ్‌ 4.9 శాతం వృద్ధితో 52,001 వాహనాలు విక్రయించింది. నెలవారీ అమ్మకాల్లో కంపెనీకి ఇవే అత్యుత్తమ గణాంకాలు. కొత్త శాంత్రోతో పాటు క్రెటా, ఎలీట్‌ ఐ20, గ్రాండ్‌ ఐ10 తదితర వాహనాలకు డిమాండ్‌ ఇందుకు తోడ్పడింది.మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 3 శాతం వృద్ధితో 24,066 యూనిట్లకు పెరిగాయి.  

బలహీన సెంటిమెంటు.. 
కొనుగోలుదారుల సెంటిమెంటు బలహీనపడటంతో గత కొద్ది నెలలుగా ప్యాసింజర్‌ వాహనాల సెగ్మెంట్‌ రిటైల్‌ అమ్మకాలు మందగించినట్లు ఎం అండ్‌ ఎం ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ విభాగం) రాజన్‌ వధేరా చెప్పారు. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంధన రేట్లు, అధిక వడ్డీ రేట్లు, బీమా ప్రీమియం పెంపు వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ తమ వాహనాలకు డిమాండ్‌ మెరుగ్గానే కనిపించిందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) డిçప్యూటీ ఎండీ ఎన్‌ రాజా చెప్పారు. టీకేఎం 2 శాతం వృద్ధితో 12,606 యూనిట్లు విక్రయించింది.అటు హోండాకార్స్‌ ఇండియా విక్రయాలు 14,234 యూనిట్ల నుంచి 14,233 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి పండుగ సీజన్‌ అయినప్పటికీ కొనుగోలుదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ గోయల్‌ చెప్పారు. అయితే, అమేజ్, కొత్తగా ప్రవేశపెట్టిన సీఆర్‌–వీ వాహనాలకు డిమాండ్‌ మెరుగ్గా కనిపించినట్లు వివరించారు.  

రెండంకెల్లో టాటా, ఫోర్డ్‌.. 
అక్టోబర్‌లో టాటా మోటార్స్, ఫోర్డ్‌ ఇండియా రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. పరిశ్రమ వృద్ధి 2 శాతానికే పరిమితం కాగా.. ప్రతికూలతలు ఉన్నప్పటికీ తాము 11 శాతం నమోదు చేసినట్లు టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీఖ్‌ చెప్పారు. గత నెలలో టాటా మోటార్స్‌ విక్రయాలు 11 శాతం వృద్ధితో 18,290 యూనిట్లకు పెరిగాయి. అటు ఫోర్డ్‌ ఇండియా అమ్మకాలు కూడా 4,218 యూనిట్ల నుంచి 9,044 యూనిట్లకు చేరాయి. బ్రాండ్‌ను పటిష్టపర్చుకోవడం, సరైన ఉత్పత్తిని పోటీ సంస్థలకు దీటైన రేటులో అందించడం, అమ్మకాల ప్రక్రియ మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతుండటం తమకు కలిసి వచ్చినట్లు ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనురాగ్‌ మెహరోత్రా చెప్పారు. 

టూవీలర్స్‌లో హీరో .. 
ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్‌ లీడర్‌ హీరో మోటోకార్ప్‌ 16.4 శాతం వృద్ధి నమోదు చేసింది. గత అక్టోబర్‌లో 6,31,105 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 7,34,668 వాహనాలను విక్రయించింది.అటు హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా అమ్మకాలు 12 శాతం వృద్ధితో 4,66,552 యూనిట్ల నుంచి 5,21,159 యూనిట్లకు పెరిగాయి. టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 26 శాతం వృద్ధి సాధించింది.3,98,427 వాహనాలను విక్రయించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 1 శాతం పెరిగి 70,451కి చేరాయి. అటు సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా 31 శాతం వృద్ధితో 65,689 వాహనాలను విక్రయించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement