
ప్రభుత్వ నిర్ణయంతో దూసుకుపోయిన షేర్లు
ముంబై: రక్షణ, విమానయాన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశీయ మార్కెట్లో విమానయాన రంగ షేర్లు భారీ లాభాలతో ముగిసాయి. స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ , ఇంటర్ గ్లోబ్ ఎయిర్ వేస్ షేర్ల లాభాల పట్టాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ .ఇప్పటివరకు 49 శాతానికి పరిమితమై ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రకటించడంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఇటీవల కొత్త విమాన యాన పాలసీతో విమానయాన రంగానికి తీపి కబురు అందించిన ప్రభుత్వం తాజాగా , వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం నాటి మార్కెట్లో ఆయా రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో దాదాపు అన్ని విమాన యాన రంగ షేర్లు గ్రీన్ గా ముగిశాయి.
స్పైస్ జెట్ 7.36 శాతం లాభాలను ఆర్జించగా, జెట్ ఎయిర్ వేస్ లిమిటెడ్ 7.03 శాతం లాభంతో రూ. 589 దగ్గర, ఇంటర్ గ్లోబ్ ఎయిర్ వేస్ 6 శాతం లాభంతో రూ.1071 దగ్గర ముగసింది.
కాగా రక్షణ, విమానయాన, ఫార్మా రంగాల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పింది. ముఖ్యంగా ఏవియేషన్ రంగంలో 100శాతం పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. అయితే డిఫెన్స్ రంగంలో కొన్ని పరిమితులను కూడా విధించింది. ఆయుధ చట్టం 1959 ప్రకారం చిన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీకి ఇవి వర్తిస్తాయి. దీంతోపాటుగా ప్రభుత్వ అనుమతి పొందిన ట్రేడింగ్, ఈ-కామర్స్, భారత్‌లో తయారయ్యే ఆహార ఉత్పత్తులపై కూడా విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా వూపింది.