యాక్సిస్ బ్యాంక్ లాభం 73% డౌన్
• ఐదు రెట్లు పెరిగిన కేటాయింపులు
• ఉద్యోగుల అవకతవకలపై త్వరలో నివేదిక
• బ్యాంక్ సీఎఫ్‌ఓ జైరామ్ శ్రీధరన్ వెల్లడి
ముంబై: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 73 శాతం క్షీణించింది. గత క్యూ3లో రూ.2,175 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.580 కోట్లకు తగ్గిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.12,531 కోట్ల నుంచి రూ.14,501 కోట్లకు పెరిగిందని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, సీఎఫ్‌ఓ జైరామ్ శ్రీధరన్ పేర్కొన్నారు. ఫీజు, ట్రేడింగ్ లాభం, తదితరాలతో కూడిన ఇతర ఆదాయం రూ.2,338 కోట్ల నుంచి రూ.3,400 కోట్లకు పెరిగిందని తెలిపారు.
స్థూల మొండి బకాయిలు 1.68 శాతం నుంచి 5.22 శాతానికి, నికర మొండి బకాయిలు 0.75 శాతం నుంచి 2.18 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు. రుణ నాణ్యతపై పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని పేర్కొన్నారు. కాగా వడ్డీ ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.4,334 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 45% వృద్ధితో రూ.3,400 కోట్లకు పెరిగిందని శ్రీధరన్ వివరించారు.
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తదనంతర పరిణామాల కారణంగా తమ బ్యాంక్ సిబ్బంది కొందరు అవకతవకలకు పాల్పడడం, అరెస్ట్ కావడం, సస్పెండ్ కావడం జరిగిందని తెలిపారు. ఈ అంశాలపై అధ్యయనం చేస్తున్న నివేదిక మరికొన్ని రోజుల్లో చేతికి వస్తుందని తెలిపారు. అయితే డీమానిటైజేషన్‌తో డిపాజిట్ అయిన పెద్ద నోట్లు ఎన్ని, ఎంత మొత్తంలో కౌంటర్లలో మార్పిడి జరిగిందో తదితర వివరాలను ఆయన వెల్లడించలేదు.
బీఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 1 శాతం క్షీణించి రూ.484 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాక బ్యాంక్ ఫలితాలు వెలువడ్డాయి.