కార్పొరేట్ల నుంచి మొండిబాకీలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సారథ్యంలోని కన్సార్షియం...
♦ ఎలక్ట్రోస్టీల్‌పై ఎస్‌బీఐ, ఎస్సార్ స్టీల్‌పై
♦ స్టాండర్డ్ చార్టర్డ్ దివాలా పిటిషన్లు
న్యూఢిల్లీ: కార్పొరేట్ల నుంచి మొండిబాకీలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సారథ్యంలోని కన్సార్షియం తాజాగా ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్‌పై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసు దాఖలు చేసినట్లు ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాల సమస్య పరిష్కారంపై జూన్ 22న జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్‌బీఐ కన్సార్షియం ఈ చర్యలు చేపట్టింది. కోల్‌కతాకు చెందిన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్.. బ్యాంకులకు సుమారు రూ. 10,000 కోట్ల పైగా బాకీ పడింది.
మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ. 293 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. అటు మరో ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్ స్టీల్‌పై స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ దివాలా చర్యలు చేపట్టింది. ఎన్‌సీఎల్‌టీలో ఈ మేరకు కేసు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్సార్ స్టీల్ బ్యాంకులకు రూ. 37,284 కోట్లు కట్టాల్సి ఉంది. బ్యాంకులకు భారీగా బాకీ పడ్డాయని ఆర్‌బీఐ గుర్తించిన 12 సంస్థల్లో ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఎస్సార్ స్టీల్ కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు రూ.8 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండి బకాయిల్లో ఈ 12 కంపెనీలవే 25%.