న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.112 కోట్ల నికర నష్టాలు (స్టాండ్‌అలోన్) వచ్చాయి. కార్పొరేట్ పన్ను రేటులో మార్పుల వల్ల రూ.2,138 కోట్ల వన్ టైమ్ పన్ను వ్యయాల కారణంగా ఈ నష్టాలు వచ్చాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుంటే ఈ క్యూ2లో నికర లాభం 157 శాతం వృద్ధితో రూ.2,026 కోట్లకు పెరిగి ఉండేదని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.790 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం రూ.15,959 కోట్ల నుంచి రూ.19,334 కోట్లకు పెరిగాయని తెలిపింది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.5,952 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
నికర వడ్డీ ఆదాయం రూ.6,102 కోట్లు ...
నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.6,102 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. 3.51 శాతం నికర వడ్డీ మార్జిన్‌ను సాధించామని, ఇది తొమ్మిది క్వార్టర్ల గరిష్ట స్థాయని పేర్కొంది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 5.96 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 5.03 శాతానికి తగ్గాయని తెలిపింది. నికర మొండి బకాయిలు 2.54 శాతం నుంచి 1.99 శాతానికి తగ్గాయని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 5.25 శాతంగా, నికర మొండి బకాయిలు 2.04 శాతంగా ఉన్నాయి. కేటాయింపులు రూ.2,927 కోట్ల నుంచి రూ.3,518 కోట్లకు పెరిగాయని తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, కేటాయింపులు తగ్గాయి. ఈ క్యూ1లో రూ.3,815 కోట్ల కేటాయింపులు జరిపామని వివరించింది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 78 శాతం నుంచి 79 శాతానికి పెరిగిందని పేర్కొంది. లోన్ బుక్ రూ.24,318 కోట్లకు పెరిగిందని, ఇది రెండేళ్ల గరిష్ట స్థాయని పేర్కొంది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో
యాక్సిస్ బ్యాంక్ షేర్ 0.4 శాతం లాభంతో రూ.713 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment