
న్యూఢిల్లీ: ఐటీ రంగ ప్రముఖుడు, విప్రో సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఫ్యూచర్ రిటైల్‌లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఫ్యూచర్ రిటైల్‌లో భారతీ గ్రూపు తనకున్న వాటాల్లోంచి 6 శాతాన్ని రూ.1,700 కోట్లకు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు విక్రయించింది. గురువారం బ్లాక్‌డీల్ రూపంలో ఈ లావాదేవీ జరిగింది. ‘‘ఫ్యూచర్ రిటైల్‌లో భారతీ గ్రూపు ప్రమోటర్లు మిట్టల్ కుటుంబానికి మొత్తం 9 శాతం వాటా ఉండగా, ఇందులో 6 శాతాన్ని ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు (ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడుల విభాగం) విక్రయించారు.
ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ప్రస్తుతం కన్జ్యూమర్ విభాగంలో అతిపెద్ద ఇన్వెస్టరుగా ఉంది. ఫ్యూచర్ లైఫ్‌స్టయిల్ ఫ్యాషన్‌లోనూ పెట్టుబడులున్నాయి’’ అని ఫ్యూచర్ గ్రూపు అధినేత కిశోర్ బియానీ తెలిపారు. అయితే, తాజా వాటా విక్రయంలో భారతీ గ్రూపునకు మొత్తం రూ.1,700 కోట్లు వెళ్లవు. ఇందులో రూ.575 కోట్లు ’క్లా బ్యాక్‘ నిబంధన కింద తిరిగి ఫ్యూచర్ రిటైల్‌కే వస్తాయి. ఈ నిధుల్ని విస్తరణ కార్యకలాపాలపై వెచ్చిస్తామని కిశోర్ బియానీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాజా విక్రయం అనంతరం ఫ్యూచర్ రిటైల్‌లో భారతీ గ్రూపు ‘సెడార్ సపోర్ట్ సర్వీసెస్’ ద్వారా ఇంకా 3 శాతం వాటా కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment