ముంబై: వాహన దిగ్గజం బజాజ్ ఆటో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో స్వల్పంగా తగ్గి రూ.1,194 కోట్లకు పడిపోయింది. గత క్యూ2లో రూ.1,200 కోట్ల నికర లాభం సాధించామని బజాజ్ ఆటో తెలిపింది. ఆదాయం రూ.6,432 కోట్ల నుంచి 2 శాతం పెరిగి రూ.6,566 కోట్లకు పెరిగిందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) ఎస్.రవికుమార్ చెప్పారు.
నిర్వహణ లాభం 0.2 శాతం ఎగసి రూ.1,297 కోట్లకు పెరగ్గా, మార్జిన్ 170 బేసిస్ పాయింట్లు తగ్గి 19.7 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. నగదు, నగదు సమాన నిధులు రూ.12,699 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉండడం, అమ్మకాలు తక్కువగా ఉండటం, ఇన్వెస్ట్‌మెంట్ ఆదాయం తక్కువగా ఉండడంతో ఇతర ఆదాయం 13 శాతం తగ్గడం తదితర కారణాల వల్ల నికర లాభం తగ్గిందని తెలిపారు.
అయితే ఈ క్వార్టర్‌లో గతంలో ఎన్నడూ లేనంత టర్నోవర్ సాధించామని, 21 శాతం ఇబిటా మార్జిన్ నమోదు చేశామని, దేశీయ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో 20 శాతానికి పైగా మార్కెట్ వాటా సాధించామని వివరించారు.
40 లక్షల వాహన విక్రయాలు లక్ష్యం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల వాహనాలు విక్రయించాలనే (ఎగుమతులను కూడా కలుపుకొని) లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధన దిశగానే విక్రయాలున్నాయని ఎస్. రవికుమార్ చెప్పారు.
ఆల్‌టైమ్ హైకి బజాజ్ ఆటో: ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, అంచనాలు మించడంతో బజాజ్ ఆటో షేర్ మంగళవారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.3,310ను తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.3,257 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment