
న్యూఢిల్లీ: బజాజ్ ఫైనాన్స్ నికర లాభం (స్టాండెలోన్) నాలుగో త్రైమాసిక కాలంలో 61 శాతం పెరిగింది. 2016–17 క్యూ4లో రూ.449 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.721 కోట్లకు ఎగసిందని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,670 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.3,557 కోట్లకు పెరిగింది. ఒక్కో షేర్‌కు రూ.4 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.3.60 డివిడెండ్‌ను ఇచ్చింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,837 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం వృద్ధితో రూ.2,647 కోట్లకు ఎగసింది. అలాగే స్థూల మొండి బకాయిలు 1.48 శాతంగా, నికర మొండి బకాయిలు 0.38 శాతంగా ఉన్నాయని కంపెనీ తెలియజేసింది. ఆర్థిక ఫలితాలు బాగుండటంతో బీఎస్‌ఈలో బజాజ్ ఫైనాన్స్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,088ను తాకింది. స్టాక్ మార్కెట్ నష్టపోయినా, ఈ షేర్ 8% లాభంతో రూ.2,067 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment