ముంబై: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం(2018–19, క్యూ2)లో రూ.488 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.331 కోట్లు)తో పోల్చితే 47 శాతం వృద్ధి సాధించామని బంధన్ బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బంధన్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.693 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో 56 శాతం వృద్ధితో రూ.1,078 కోట్లకు ఎగసిందని వివరించారు. నికర వడ్డీ మార్జిన్ 9.3 శాతం నుంచి 10.9 శాతానికి పెరిగిందని తెలిపారు.
తగ్గిన మొండి బకాయిలు...
స్థూల మొండి బకాయిలు 1.4 శాతం నుంచి 1.3 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 0.8 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గాయని చంద్రశేఖర్ తెలిపారు. డిపాజిట్లు రూ.25,442 కోట్ల నుంచి 30 శాతం వృద్ధితో రూ.32,959 కోట్లకు పెరిగాయని వివరించారు. మొత్తం రుణాలు రూ.22,111 కోట్ల నుంచి 51 శాతం వృద్ధితో రూ.33,373 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం రుణాల్లో సూక్ష్మ రుణాల వాటాయే 87 శాతంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం 938 బ్రాంచ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, సగటున ఒక్కో బ్రాంచ్‌కు 3,000 మంది ఖాతాదారులకు సేవలందిస్తోందని తెలిపారు. కాసా నిష్పత్తి 28.2 శాతం నుంచి 36.9 శాతానికి, క్యాపిటల్ అడెక్వసీ రేషియో 26.3 శాతం నుంచి 32.6 శాతానికి పెరిగాయని తెలిపారు. కేటాయింపులు 43 శాతం పెరిగి రూ.124 కోట్లకు చేరాయని పేర్కొన్నారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బంధన్ బ్యాంక్ షేర్ మంచి లాభాలు సాధించింది. 5.6 శాతం లాభంతో రూ.512 వద్ద ముగిసింది.
బంధన్ బ్యాంక్ లాభం 47% అప్
Published Thu, Oct 11 2018 12:42 AM | Last Updated on Thu, Oct 11 2018 12:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment