సెన్సెక్స్ హై జంప్...
♦ 460 పాయింట్లు ఆప్
♦ 25,689 పాయింట్ల వద్ద ముగింపు
♦ నాలుగు వారాల్లో ఇదే పెద్ద ర్యాలీ
ముంబై: విదేశీ ఫండ్స్ కొనుగోళ్ల జోరుతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ నాలుగువారాల్లో ఎన్నడూలేనంత పెద్ద ర్యాలీ జరిపింది. 460 పాయింట్ల భారీ పెరుగుదలతో 25,689 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 13 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే భారీ ర్యాలీ. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జూన్ నెలలో వడ్డీ రేట్లు పెంచకపోవొచ్చన్న అంచనాలతో పాటు కొన్ని కంపెనీల నుంచి వెలువడిన ప్రోత్సాహకర క్యూ4 ఫలితాలు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న సంకేతాలివ్వడంతో ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు పెరిగిందని, దాంతో సూచీలు కదం తొక్కాయని విశ్లేషకులు చెప్పారు.
7,800 పాయింట్ల స్థాయిని అవలీలగా అధిగమించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 133 పాయింట్ల లాభంతో 7,866 వద్ద ముగిసింది. అమెరికాలో ఉపాధి కల్పన ఏప్రిల్‌లో నెమ్మదించిందన్న వార్తలతో ఫెడ్ జూన్ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు పెంచదన్న ఆశలు నెలకొన్నాయని బీఎన్‌పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు. జర్మనీలో మార్చి నెలలో తయారీ ఆర్డర్లు బాగా పెరిగాయన్న వార్తలతో యూరప్ సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలో ర్యాలీ జరపడంతో, ఇక్కడి మార్కెట్ పటిష్టంగా ముగిసిందని బ్రోకింగ్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఆసియాలో చైనా షాంఘై సూచి 2.79 శాతం నష్టపోయింది. తైవాన్, కొరియా సూచీలు స్వల్పంగా క్షీణించాయి. హాంకాంగ్, జపాన్, సింగపూర్ ఇండెక్స్‌లు 0.23-1.29 శాతం మధ్యపెరిగాయి.
బజాజ్ ఆటో జోరు...: సెన్సెక్స్-30 షేర్లలో అధికంగా ద్విచక్రవాహన కంపెనీ బజాజ్ ఆటో 3.78 శాతం ర్యాలీ జరిపి రూ. 2,528 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ 3.41 శాతం పెరగ్గా, ఆకర్షణీయమైన క్యూ4 ఫలితాలతో గత కొద్ది ట్రేడింగ్ సెషన్ల నుంచి పెరుగుతూవస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ మరో 3.12 శాతం ఎగిసి, రూ. 1,204 వద్దకు చేరింది. సిగరెట్ల ఉత్పత్తిని పునర్‌ప్రారంభించిందన్న వార్తలతో ఐటీసీ 2.38 శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, హీరో మోటోకార్ప్, ఆసియన్ పెయింట్స్ షేర్లు 2-3.2 శాతం ఎగిసాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.9 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి రూ. 1,141 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ ఇండెక్స్ టాప్...: వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్‌ఈ బ్యాంకింగ్ సూచి 2.45 శాతం ర్యాలీ జరిపింది. క్యాపిటల్ గూడ్స్, టెలికాం, రియల్టీ, ఆటో, టెక్నాలజీ, పవర్ సూచీలు 1.4-1.86 శాతం మధ్య పెరిగాయి.
ర్యాలీకి కారణాలు...
1. జూన్‌లో ఫెడ్ రేటు పెంచకపోవొచ్చు: అమెరికాలో ఉపాధి కల్పన ఏప్రిల్ నెలలో గత ఏడు నెలల్లో ఎన్నడూ లేనంత మందకొడిగా వుందంటూ వెలువడిన గణాంకాలతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను జూన్ నెలలో పెంచకపోవొచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయి. జూన్‌లో వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గుచూపుతూ గత కొద్దిరోజులుగా ఫెడ్ అధికారులు చేస్తున్న ప్రకటనలకు తాజా డేటాతో బ్రేక్‌పడింది. ఈ అంశం స్టాక్ మార్కెట్‌కు టానిక్‌లా పనిచేసింది.
2. క్రూడాయిల్ ధరల పెరుగుదల: సోమవారం ఆసియా ట్రేడింగ్‌లో బ్యారల్ ముడి చమురు ధర 2.5 శాతంపైగా ఎగిసింది. ఏప్రిల్ నెలలో చైనాకు క్రూడ్ దిగుమతులు 7 శాతం పెరిగాయన్న వార్తలు, కె నడా చమురు క్షేత్రాల్లో మంటలు చెలరేగడంతో ప్రపం చ మార్కెట్లోకి చమురు సరఫరాలు తగ్గుతాయన్న అంచనాలు క్రూడ్ పెరుగుదలకు దారితీసాయి. ఈ అంశం కూడా ఈక్విటీ మార్కెట్‌కు మద్దతునిచ్చింది.
3. క్యూ4 ఫలితాల ఎఫెక్ట్: కొన్ని కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలకంటే మెరుగ్గా వుండటంతో బుల్స్ కొనుగోళ్ల జోరు పెంచారు. ఇన్ఫోసిస్, హీరో మోటో, అల్ట్రాటెక్ సిమెంట్‌లతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఫలితాలు మార్కెట్‌ను ఆకర్షించినట్లు విశ్లేషకులు చెపుతున్నారు.